వాస్తు శాస్త్రం ప్రకారం మన ఇంట్లోని బీరువా కేవలం బట్టలు లేదా నగలు దాచుకునే స్థలం మాత్రమే కాదు అది లక్ష్మీ దేవి నివాసముండే కుబేర స్థానం. మనం బీరువాను ఎలా ఉంచుతాము మరియు అందులో ఏయే వస్తువులు పెడతాము అనే దానిపైనే మన ఆర్థిక స్థితిగతులు ఆధారపడి ఉంటాయి. చాలామంది తెలియక కొన్ని వస్తువులను బీరువాలో పెట్టి ఆర్థిక ఇబ్బందులను కొనితెచ్చుకుంటారు. మన ఇంట్లో సంపద నిలవాలన్నా సానుకూల శక్తి పెరగాలన్నా బీరువా విషయంలో కొన్ని జాగ్రత్తలు తప్పనిసరి.మరి వాటి గురించి తెలుసుకుందాం..
బీరువాలో పొరపాటున కూడా పెట్టకూడని వస్తువులు: బీరువాలో ప్రధానంగా నాలుగు వస్తువులు అస్సలు ఉండకూడదు. మొదటిది చిరిగిన పాత బట్టలు లేదా చిరిగిన పర్సులు. ఇవి దరిద్రానికి చిహ్నాలుగా పరిగణించబడతాయి వీటి వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తి ప్రవేశిస్తుంది. రెండోది నులక తాళ్లు లేదా పనికిరాని పాత ఇనుప వస్తువులు. ఇవి రాహు దోషాన్ని పెంచి మానసిక అశాంతికి గురిచేస్తాయి.
మూడోది, కోర్టు వివాదాలకు సంబంధించిన పత్రాలు, పోలీస్ కేసులకు సంబందించిన పేపర్స్ పెట్టకూడదు, డబ్బు ఉంచే చోట ఇలాంటి గొడవలకు సంబంధించిన కాగితాలు పెడితే ఖర్చులు పెరిగి అప్పుల పాలయ్యే అవకాశం ఉంటుంది.ఇక నాలుగోది, చనిపోయిన పూర్వీకుల ఫోటోలు. వారిని మనం గౌరవించుకోవాలి కానీ నగదు మరియు బంగారం ఉంచే బీరువాలో వారి ఫోటోలు పెట్టడం వాస్తు రీత్యా మంచిది కాదు.

సంపద పెరగాలంటే పాటించాల్సిన నియమాలు: బీరువాను ఎల్లప్పుడూ ఇంటికి నైరుతి (South-West) మూలలో ఉంచి, దాని తలుపులు ఉత్తరం వైపు తెరుచుకునేలా చూసుకోవాలి. బీరువా లోపల ఎప్పుడూ ఒక చిన్న అద్దాన్ని ఉంచడం వల్ల లోపల ఉన్న సంపద ప్రతిబింబించి రెట్టింపు అవుతుందని నమ్ముతారు. అలాగే బీరువా అడుగు భాగంలో ఖాళీగా ఉంచకుండా ఒక ఎర్రటి వస్త్రాన్ని పరిచి దానిపై నగదును ఉంచడం శుభప్రదం.
మనం దాచుకున్న డబ్బుకు గౌరవం ఇస్తూ బీరువాను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకుంటే మహాలక్ష్మి అనుగ్రహం ఎల్లప్పుడూ మనపై ఉంటుంది. సరైన వాస్తు నియమాలు పాటిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి సుఖసంతోషాలు చేకూరుతాయి అని వాస్తు నిపుణులు తెలుపుతున్నారు.
గమనిక: పైన పేర్కొన్న విషయాలు వాస్తు శాస్త్ర నిపుణులు మరియు సంప్రదాయ నమ్మకాలపై ఆధారపడి అందించబడినవి. వీటిని పాటించడం అనేది మీ వ్యక్తిగత విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది.
