నెమిలి అంటే ఇష్టపడని వాళ్లు ఎవరూ ఉండరేమో కదా..పురివిప్పి నెమలి నాట్యం చేస్తుంటే.. ఎంత అందంగా ఉంటుందో. ఇక దాని ఈకలు అంటే ఎక్కడలేని ఆసక్తి. చిన్నప్పుడు అయితే పుస్తకాల్లో పెట్టుకుని వాటికి మేతలు కూడా వేసేవాళ్లం..ఇప్పుడు దొరికితే..ఇంట్లో హాల్లో పెట్టుకుంటారు. నెమలికి హిందూ పురాణాల్లో ప్రత్యేక స్థానం ఉంది. మన దేశ జాతీయ పక్షి. అయితే నెమలి వాస్తు ప్రకార అదృష్టానికి చిహ్నమని భావిస్తారు. నెమలి ఈక ఇంటిలోని అనేక రకాల వాస్తు దోషాలను తొలగిస్తుందట. సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. కనుక వాస్తులో నెమలి ఈకలు చాలా ఉపయోగకరంగా మన పండితులు పరిగణిస్తున్నారు. ఈరోజు నెమలి ఈకలను కొన్ని దోషాల నివారణకు ఎలా ఉపయోగించవచ్చో చూద్దాం.
సంతోషకరమైన వైవాహిక జీవితం కోసం:
నేటి కాలంలో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఎక్కువైపోతున్నాయి. వైవాహిక జీవితంలో ఏదో ఒక సమయంలో వివాదాలు తలెత్తే పరిస్థితి ఏర్పడుతూనే ఉంది. అటువంటి వారు బెడ్ రూమ్ లో తూర్పు లేదా ఉత్తరం వైపున ఉన్న గోడకు రెండు నెమలి ఈకలను కలిపి ఉంచడం వల్ల దాంపత్య జీవితానికి సంబంధించిన సమస్యలు తొలగి.. సంతోషకరమైన వైవాహిక బంధం నెలకొంటుందట.
జాతకంలో దోషాల నివారణకు:
కొంతమందికి జాతకంలో కాల సర్ప దోషంతో సహా రాహు-కేతువు వంటి అనేక రకాల దోషాలు ఉంటాయి. వీటి ప్రభావంతో జీవితంలో దుష్ప్రభావాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది కూడా… అటువంటి పరిస్థితిలో, వ్యక్తి తన జాతకం నుండి ఈ దుష్ప్రభావాన్ని తొలగించాలనుకుంటే, బెడ్ రూమ్ లోని పశ్చిమ దిశలో ఉన్న గోడపై నెమలి ఈకలను ఉంచడం వలన మంచి ఫలితాలు కలుగుతాయట. ఇలా చేయడం వల్ల ఇంటిలోని ప్రతికూలత తొలగిపోవడంతో పాటు అనేక ప్రయోజనాలు కూడా లభిస్తాయని నమ్మకం.
చదుకునే పిల్లలకు:
చదువు అంటే శ్రద్ధ పెట్టని పిల్లలకు చదువు అంటే ఆసక్తి కలగడానికి పిల్లలు చదువుకునే టేబుల్ పై ఏడు నెమలి ఈకలను ఉంచడం వల్ల ప్రయోజనం ఉంటుందట.
ఆర్థిక సమస్యల నివారణకు:
ఆర్ధిక సమస్యతో ఇబ్బంది పడేవారు నెమలి ఈకను ఇంటిలోని ఆగ్నేయ మూలలో ఉంచండి. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. అంతేకాదు రావాల్సిన డబ్బులు కాకుండా నిలిచిపోయిన డబ్బు కూడా అందుతుంది. నిలిచిపోయిన పనులు కూడా పూర్తవుతాయట..
పనిలో అంతరాయాలను తొలగించడానికి:
మీ పనిలో నిరంతరం ఆటంకాలు ఏర్పడిుతూ..చేపట్టిన పని సమయానికి పూర్తి చేయకపోతే.. సాధారణ రోజుల్లో మీ ఇంటి పూజా స్థలంలో ఐదు నెమలి ఈకలను ఉంచి వాటిని ప్రతిరోజూ పూజించండి. 21వ రోజున ఈ నెమలి ఈకలను అల్మారాలో ఉంచితే.. ఆగిపోయిన పనులు తిరిగి ప్రారంభమవుతాయని వాస్తుశాస్త్రం చెబుతోంది.
-Triveni Buskarowthu