Ganesh Chaturthi: వినాయకుడికి గల గజముఖానికి మొదట్లో రెండు దంతాలూ ఉండేవి. పరశురాముడి గొడ్డలి దెబ్బ వల్ల ఒక దంతాన్ని పోగొట్టుకుని ఏకదంతుడయ్యాడట. ఆ కథందో తెలుసుకుందాం… కార్తవీర్యార్జునుడిని సంహరించిన తర్వాత పరుశురాముడు పరమశివుడి దర్శించుకోవడానికి కైలాసం వెళ్ళాడు.’
ఆ సమయానికి శివపార్వతులు ఏకాంతంలో వున్నారు. బయట కాపలా కాస్తున్న గణపతి పరశురాముడిని అడ్డగించి, ఇప్పుడు లోపలికి వెళ్ళడానికి వీలు పడదన్నాడు. పరమేశ్వరుడిని దర్శించుకోకుండా నన్ను అడ్డగించడానికి నీవెవ్వడివి అంటూ పరుశురాముడు వినాయకుడిపై నిప్పులు చెరిగాడు. మాటా మాటా పెరిగి ఇద్దరికీ యుద్ధం మొదలైంది. వినాయకుడు తన తొండంతో పరశురాముడిని పైకెత్తి గిరగిరా తిప్పి కిందకు పడేశాడు. దెబ్బకు పరశురాముడి కళ్లు బైర్లుకమ్మాయి. కొద్ది క్షణాలకు తెప్పరిల్లిన పరశురాముడు పట్టరాని ఆగ్రహంతో తన చేతిలోని గండ్రగొడ్డలిని వినాయకుడి పైకి విసిరాడు.
గొడ్డలి తాకిడికి ఒక దంతం ఊడిపడింది. ఆ చప్పుడుకు ఉలిక్కిపడి పార్వతీపరమేశ్వరులు బయటకు వచ్చారు. దంతం విరిగి నెత్తురోడుతున్న బాల గణపతిని చూసిన పార్వతీదేవి పరశురాముడిని మందలించింది. అపరాధానికి మన్నించమంటూ క్షమాపణలు వేడుకున్నాడు పరశురాముడు. అంతటి ఆ కథ ముగిసినా, వినాయకుడు ఏకదంతుడిగా పేరుపొందాడు.