వినాయక చవితి వచ్చేస్తోంది. యావత్ దేశం గణేశ్ చతుర్థి కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. ఇప్పటికే చాలా చోట్ల ఏర్పాట్లు మొదలయ్యాయి. కొంతమంది మండపాల తయారీ, విగ్రహాలకు ఆర్డర్ ఇవ్వడం షురూ చేశారు. ఇక చందాల సేకరణ ఎప్పుడో మొదలైంది.
అయితే వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలని ఏర్పడిన సందిగ్ధతపై తెలంగాణ విద్వత్సభ క్లారిటీ ఇచ్చింది. గణేశ్ చతుర్థిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? 19వ తేదీన నిర్వహించాలా అనేది కొద్దిరోజులుగా ప్రజల్లో ఓ సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో.. భాద్రపద శుక్ల చతుర్థి అయిన సోమవారం (సెప్టెంబర్ 18వ తేదీన ) వినాయక చవితి పండుగను నిర్వహించుకోవాలని తెలంగాణ విద్వత్సభ స్పష్టం చేసింది. 18వ తేదీన ఉదయం 9.58గంటలకు చవితి ఆరంభమై 19న ఉదయం 10.28గం.లకు ముగుస్తుందని, అందుకే వినాయక చవితి పండుగను సోమవారం రోజే జరుపుకోవాలని విద్వత్సభ అధ్యక్షులు యాయవరం చంద్రశేఖర శర్మ సిద్ధాంతి, కార్యదర్శి దివ్యజ్ఞాన సిద్ధాంతి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.