జీవితాన్ని ఒంటి రంగులతో ముడిపెడ్తారు
లోకాన్ని కొన్ని నీఛ,నికృష్ట రాతలతో శాసిస్తారు
ఇక్కడే కొందరు.. ఇవన్నీ లేని రోజున..
మంచి మార్పులు సిద్ధిస్తాయి
ఇవన్నీ ఉన్నా..వాటిని కాదని..కాల్దన్ని..
ఓ గొప్ప ప్రతిపాదన తెరపైకి రావాలి..వచ్చింది
గిరి కోనల నుంచి…హస్తినపురి వరకూ ఒకే పేరు మార్మోగుతోంది
ఇది గొప్ప విజయం కాదు తెలుసు కానీ కొన్ని ఆరంభాలను
స్వాగతించడం కూడా విజ్ఞతే !
అతిసాధారణ కుటుంబం నుంచి వచ్చిన వారికి మనుషులంటే ఇతరుల కన్నా కాస్త ఎక్కువ గౌరవం ఉంటుంది. జీవితాన్ని ఎక్కడో ఒక స్థానం దగ్గర నిలిపి అందరినీ పరిశీలించి చూశాక వారికి ఇతరుల కన్నా ఎక్కువగానే ప్రపంచం అర్థం అయి ఉంటుంది. ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొన్ని తప్పులు చేసి ఉన్నారు.. కొన్ని మంచి పనులు కూడా చేసి ఉన్నారు. మంచి అని చెప్పుకునేందుకు ఇప్పుడు కూడా కొంత అంగీకారంతోనూ, అర్హతతోనూ ఉన్నారు. దేశ ప్రథమ మహిళ అనే గొప్ప బాధ్యతనూ, పదవినీ ఆయన ద్రౌపదీ ముర్మూ అనే ఒడిశా టీచరమ్మకు అప్పగిస్తున్నారు. ఈ ఒడిశా టీచరు అతి సామాన్యురాలు అని విన్నా ను. జీవితంలో ఎన్నో కోల్పోయినా కూడా నిబ్బరంగా ఎలా జీవించడం అన్నది ఇతరులకు నేర్పిన వారు అని విన్నాను. వారికి, వారిలోని నిరాడంబర తత్వానికి జేజేలు పలకాలి ఈ ఆదివారం. గిరి కోనల నుంచి, మా తూరుపు వాకిట నుంచి వస్తున్న ఈ ఆశా కిరణం రాక కారణంగా గొప్ప మార్పులు రావాలి. అత్యాశ…అని తెలుసు ! 100 శాతం మేలు ఆ పదవి వల్ల జరిగాలి. వాస్తవ
దూరం అని కూడా తెలుసు ! కానీ ఈ మార్పును ఆరంభ దశలో ఉన్న ఈ మార్పును అంగీకరించడం ముందు కొందరు నేర్చుకుంటే.. చాలు.. అది కూడా చేతగాని వాళ్లంతా ఏవేవో రాస్తున్నారు.. రాస్తుంటారు కూడా !
నిన్నటి వేళ మహిళా కమిషన్ చైర్మన్ వాసిరెడ్డి పద్మ ఆమె రాకను, ఆమె అభ్యర్థిత్వాన్నీ బలపరిచారు. అదేవిధంగా ద్రౌపదీ ముర్మూను ఉద్దేశించి తప్పుడు మాటలు మాట్లాడిన రామ్ గోపాల్ వర్మ అనే దర్శకుడికి నోటీసులు ఇస్తాం అని చెప్పారు. మొదటి సారి ఆర్జీవీ అనే వృద్ధ దర్శకుడు నచ్చలేదు. ఆయన ఎన్నో పరిపక్వతలతో కూడిన పనులు చేశారు. సెల్యులాయిడ్ పై కొన్ని మంచి ప్రయోగాలు చేశారు. కానీ ఈ రోజు ఆయన దిగజారి మాట్లాడారు. డియర్ సర్ ! మీరు తప్పు చేస్తున్నారు అన్న సంగతి మీకేమయినా తెలుస్తుందా ? ఇంకో మంచి విషయం రాజా సింగ్ అనే ఎమ్మెల్యే కూడా స్పందించి ఆర్జీవీ పై కోపం అయ్యారు. రాజా సింగ్ అనే వ్యక్తి ఘోషమహల్ ఎమ్మెల్యే.. వివాదాస్పద ఎమ్మెల్యే .. అయినా సరే వారి మాటలు కూడా పరిగణించాలి.
దేశానికి సారథ్యం వహించే ముర్మూ సొంత ఊరు ఎలా ఉంది అని చాలా మంది ఆరాతీస్తున్నారు అని చదివేను. విన్నాను.
పాపం ! ఆమె పుట్టిన ఊరు చాలా బీద ప్రాంతం.. కుగ్రామం.. ఆ గ్రామంకు దగ్గరలో ఉన్న గ్రామంలో విద్యుత్ లేదు. ముర్ము మేనల్లుడు నివసించే కుగ్రామంలో విద్యుత్ లేదు. కిరోసిన్ దీపాలతో చీకటి అయితే చాలు సావాసం చేస్తారని విన్నాను. ఒడిశా రాష్ట్రం, మయూర్‌భంజ్ జిల్లా, కుసుమి బ్లాక్ పరిధిలోని ఉపర్బెడ గ్రామంలో జన్మించిన ముర్మూ.. ఇప్పటికీ అదే సాదాసీదా జీవితం ఎలా నెట్టుకువస్తున్నారు ? వింటే ఆశ్చర్య పోతారు, చూస్తే డంగై పోతారు అని రాస్తుంటారే పనికి మాలిన రాతలు…
ఆ విధంగా కాకుండా ఆలోచిస్తే ఈ దేశం ఆమె నుంచి ఆమె ఊరి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ! కొన్ని అడ్డదిడ్డం అయిన రాతలు చదివేక కోపం వస్తుంది. పాపం ! ఆమె శరీర రంగును ఉద్దేశించి మాట్లాడుతున్నారు.. అప్పుడు కూడా ఎంత తప్పు ! వీళ్లకు నిజంగానే మానవత్వం అన్నది ఉందా ? ఏదో మనుషులం అని చెప్పుకుని తిరుగుతున్నారా ? అని కూడా అనుకున్నాను.
మళ్లీ ముర్మూ ఊరి విషయం దగ్గరకే వస్తే ఆ ఊరికి దగ్గర్లోనే రెండు కుగ్రామాలు ఉన్నాయని చదివేను. బాదాసాహి, దుంగ్రిసాహి అనే రెండు ప్రధాన కుగ్రామాలు అవి..అందులో బాదాసాహికి విద్యుత్ సౌకర్యం ఉందని, దుంగ్రిసాహికి విద్యుత్ సౌకర్యం లేదని చదివేను..ఇప్పుడు అధికారులు స్పందించి విద్యుత్ తీగలు వేస్తే మంచి జరుగుతుంది ఊరికి అని అంటున్నారు ద్రౌపదీ ముర్మూ బంధువులు..అర్జీ కూడా ఇచ్చి వస్తూ వస్తూ ఆనందంతో వాళ్లు తమ ఇంటి విజయాలను తల్చుకుంటున్నారు.. మళ్లీ ఊళ్లో
ఓ చోట కిరోసిన్ దీపం వెలుగుతుంది.. ఆ వెలుగుల్లో అక్షరాలు కూడా వెలుగుతాయి.. ముఖంలో చీకటి పోయి వెలుగు వస్తుంది.. జీవితాన చీకటి పోయి వెన్నెల వస్తుంది.. అంతా మంచే అని రాయడం తప్పు కాదు ఓ దృక్పథం మాత్రమే ! మా ఊళ్లో మీలాంటి బిడ్డలు చాలా మంది ఉన్నారు ముర్మూ ..మీరు రావాలి..వారికి అండగా ఉండాలి.. మా ఊరు అంటే మారుమూల శ్రీకాకుళం జిల్లా అని, మీరు వస్తే మార్పు అని రాయను.. మీరు వచ్చి, వెళ్లాక తరువాత జరిగే మార్పే గొప్పది అని మాత్రమే అంటాను.. ఎవరో రాశారు దుఃఖించదగ్గ సందర్భం అని ! అక్కసుతో అజ్ఞానంతో రాసిన రాతలవి !
వాస్తవానికి పంచె కట్టు పెద్దాయనకు చెందిన వర్గాలకే ఇది దుఃఖించ దగ్గ సందర్భం..మా వరకూ అయితే కాదు. కాకూడదు కూడా ! పంచెకట్టు పెద్దాయన అంటే ముప్పవరపు వెంకయ్యనాయుడు అనే ఉప రాష్ట్రపతి పదవిలో ఉన్న వ్యక్తి అని అర్థం. డియర్ సర్ ! మీరు విశ్రాంతి తీసుకోండి..ఎందుకని మీరు విశ్రాంతి భవనంలోకి వెళ్లేందుకు ఇష్టపడడం లేదు.. ఏం కాదు… టేక్ రెస్ట్ ఫర్ సమ్ టైమ్ ఆన్ వర్డ్స్ .. కొన్ని సార్లు విరామం అవసరం.. కొన్ని సార్లు విస్తృతి కూడా అవసరమే ! మీకు పదవి రాకపోవడం మంచిదే ! కొన్ని మార్పులకు అదే ఆరంభం కదా ! కనుక హాయిగా ఉండండి.. అలానే ఆమె రాకను స్వాగతించండి..
డియర్ మేడమ్ !ఆల్ ద బెస్ట్.. మేమంతా మీ వెంటే..ఆ తెలంగాణ బిడ్డలూ.. ఈ ఆంధ్రా పౌరులూ అంతా మీ వెంటే.. శుభాకాంక్షలతో…
– రత్నకిశోర్ శంభుమహంతి, శ్రీకాకుళం