కొన్నిసార్లు మంచి నిర్ణయాల కారణంగా పాలనలో మార్పులు వస్తాయి. మంచి నిర్ణయాలను వెల్లడించేందుకు ప్రభుత్వం తరఫున చేపట్టే అధికారిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తే బాగుంటుంది కానీ కేవలం వాటిని విమర్శలను వినిపించేందుకే వాడుకోవడం కారణంగా పాలకులు తమ ప్రతిష్టను తగ్గించుకుంటున్నారు. ఒక విధంగా జగన్ ప్రభుత్వం మంచి చేస్తే రానున్న కాలంలో కూడా ఆ మంచి కొనసాగడం ఖాయం. దీన్నెవ్వరూ నిలువరించ లేరు. ఏదేమైనప్పటికీ ప్రజా స్వామ్యంలో ప్రజలే దేవుళ్లు.. వాళ్లే అంతిమ నిర్ణేతలు కూడా !
ఎన్నో కష్టాలు దాటుకుని ఎన్నో అవమానాలు దాటుకుని జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారు.ఆ రోజు ముఖ్యమంత్రి కొడుకు ముఖ్యమంత్రి కావాలా అని ఎత్తిపొడుపు మాటలు దాటుకుని ఆయన విజేత అయ్యారు. ఆ విజేత స్థానాన్ని వివాదాలమయం చేయకూడదు. ఓ పాలనతో తప్పులు నమోదు అవుతూ ఉంటాయి. ఓ పాలనలో తప్పులుంటాయి. వాటిని పరిష్కరించాలి. ఏకపక్షంగా మాట్లాడితే జగన్ కు ఇకపై కూడా ఇటువంటి ఇబ్బందులే వస్తాయి. ఇప్పటికీ వైసీపీ పెద్దలు తప్పులు చెబితే దిద్దుకోలేని ఇబ్బందుల్లో ఉన్నారు.
అంటే తప్పులు దిద్దుకోవడం ఇష్టం లేదా.. వాళ్లే ఎందుకులే ఇదంతా అని వదిలేస్తున్నారా?
ఓ నాయకుడు క్షేత్ర స్థాయిలో ఎదగాలి. ఓ నాయకుడు తిరుగులేని మెజార్టీతో రాణించాలి. ఇకపై కూడా జగన్ గెలుపు సాధించాలంటే ముందు ఆయనేం చేయాలనుకుంటున్నారో అవన్నీ పూర్తి చేశాకనే విపక్షాలతో గొడవ పెట్టుకోవాలి. అత్యాచార బాధితుల గురించి ఆయన మాట్లాడాల్సిన మాటలేనా అవి ! ఏ పార్టీ అయినా ఇలాంటివి జరగాలని కోరుకుంటుందా ? అంటే విపక్ష హోదా లో ఉంటూ సమస్యలు వినిపించింది కూడా కేవలం రాజకీయ ప్రయోజనానికే తప్ప ప్రజా ప్రయోజనానికి కాదా ?
ప్రజాస్వామ్యంలో పాలక పక్షాలకూ, విపక్ష నాయకులకూ ఉండే వివాదాలను కేవలం అక్కడికే పరిమితం చేయాలి. ఎంత వరకూ ఉంటే అంత మేలు అంటారు కదా ! ఆ విధంగా తగాదాలనూ, విమర్శలనూ అధికారిక సభల్లో వినిపించకూడదు. ఓ అధికారిక సభలో ఏం మాట్లాడాలో అన్న స్పష్టత కూడా ఉండాలి. గతంలో కూడా ఈ విధంగా చేసి కొన్ని ప్రభుత్వాలు పరువు పోగొట్టుకున్నాయి. కానీ విడ్డూరం ఏంటంటే ఇదే పద్ధతిలో జగన్ కూడా ఉంటున్నారు. ప్రతిపక్షం చెడ్డ చెబితే వాటిని సైతం నిలువరించాల్సిన బాధ్యత పాలక పక్షందే ! టీడీపీ ఆరోజు అంతా మంచి చేయలేదు. అందుకే ప్రజలు ఇంటికి పంపారు. మరి! ఇప్పుడు వైసీపీ చేయాల్సింది ఏంటి అదే పనిగా విపక్షాన్ని తిట్టడమా ? వాటి వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు ఉండదు కూడా !