కరోనా వైరస్ ఇప్పటికే మన దేశంలో అనేక మందికి ఉద్యోగాలు పోగొట్టింది. లక్షలాది మంది కార్మికులు, వలస కూలీలు నిరాశ్రయులయ్యారు. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మొదలుకొని కార్పొరేట్ సంస్థల వరకు తీవ్రమైన నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అందరికీ ఉపయోగపడేలా ఆర్థిక వ్యవస్థకు పునరుజ్జీవం కలిగించడం ప్రభుత్వాలకు కత్తి మీద సాములా మారింది. అయితే గోటి చుట్టుకు రోకలి పోటు అన్న చందంగా.. ఇప్పటికే కష్టాల్లో ఉన్న రెండు తెలుగు రాష్ట్రాలకు.. మరో పెద్ద కష్టం ఎదురు కానుంది.
గల్ఫ్ దేశాల్లో పనిచేస్తున్న లక్షలాది మంది తెలుగు కార్మికులు లాక్‌డౌన్ ఎత్తేశాక తిరిగి సొంత రాష్ట్రాలకు రానున్నారు. ఆయా దేశాల్లో అన్ని ప్రాజెక్టులు, పనులు ఆగిపోవడంతో.. వారందరూ తమ తమ ఉద్యోగాలను, పనులను కోల్పోయారు. దీంతో వారికి మరొక దారి లేదు. ఈ క్రమంలోనే వారందరూ లాక్‌డౌన్ ఎత్తేశాక విడతల వారీగా సొంత రాష్ట్రాలకు రానున్నారు. కాగా గల్ఫ్ దేశాల్లో దాదాపుగా 85 లక్షల మంది భారతీయులు పనిచేస్తున్నారని నివేదికలు చెబుతుండగా.. వారిలో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు 26 లక్షల మంది ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే వారందరూ సొంత రాష్ట్రాలకు రానుండడంతో ఇప్పుడు ప్రభుత్వాలపై మరింత భారం పడనుంది.
అయితే ఇప్పటికే ఇక్కడ ఉన్న అనేక మంది ఉద్యోగాలు, ఉపాధిని కోల్పోయిన నేపథ్యంలో గల్ఫ్ దేశాల బాధితులు వస్తే.. వారి సంఖ్య మరింత పెరగనుంది. దీంతో ఆ స్థితిని ప్రభుత్వాలు ఎలా హ్యాండిల్ చేస్తాయన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ముందు ముందు ఏవైనా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తే.. కార్మికులు, కూలీలకు ఎంతో కొంత ఉపశమనం కలుగుతుందని నిపుణులు భావిస్తున్నారు. అయినప్పటికీ వారికి శాశ్వత ఉపాధి లభిస్తే తప్ప సమస్య తీరదు. ఇక ప్రభుత్వాలు ఈ విషయంపై ఏం ఆలోచిస్తాయన్నది.. వేచి చూస్తే తెలుస్తుంది..!