కరోనా వైరస్‌కు అడ్డుకట్ట వేసేందుకు ప్రధాని మోదీ దేశంలో మే 3వ తేదీ వరకు లాక్‌డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇక తెలంగాణలో మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్ పొడిగించారు. పలు ఇతర రాష్ట్రాల్లో ఏప్రిల్ 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అయితే దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో లాక్‌డౌన్‌ను ఇంకా పొడిగించాలని కేంద్రం ఆలోచిస్తున్నదట. ఈ క్రమంలోనే మే 30వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని ప్రచారం జరుగుతోంది.
తాజాగా పలు మీడియా సంస్థలు, అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థలు చేసిన సర్వే ప్రకారం.. మే రెండో వారానికి మన దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 75వేలకు చేరుకోనుందట. అందువల్ల మే 15వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే అలా చేసినా సెప్టెంబర్ వరకు కరోనా ప్రభావం ఉంటుందని సమాచారం. అదే లాక్‌డౌన్‌ను మే 30వ తేదీ వరకు పొడిగిస్తే.. జూన్‌లోనే కరోనా ప్రభావం పూర్తిగా తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. అందుకని మే 30వ తేదీ వరకు మన దేశంలో లాక్‌డౌన్‌ను పొడిగిస్తారని తెలుస్తోంది.
ఇక సింగపూర్ ఇప్పటికే జూన్ 1వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించింది. నిజానికి అక్కడ భారత్ లాంటి పరిస్థితి లేదు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఇక దేశంలోని అన్ని రాష్ట్రాల సీఎంలతో పోలిస్తే.. తెలంగాణ సీఎం కేసీఆర్ లాక్‌డౌన్ పొడిగింపుపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. మన వద్ద ఉన్న వైద్య సదుపాయాలను బట్టి చూస్తే.. పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదు అయితే చికిత్స అందించలేం.. కనుక పరిస్థితి అదుపు తప్పకముందే.. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గేవరకు లాక్‌డౌన్ ఒక్కటే ఉత్తమమైన మార్గం అని సీఎం కేసీఆర్ ఆలోచించారు. అందుకనే తెలంగాణలో ఆయన మే 7వ తేదీ వరకు లాక్‌డౌన్‌ను పొడిగించారు. అయితే మే 5వ తేదీన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో అప్పటి పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. కానీ.. ప్రస్తుతం రోజు రోజుకీ పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్యను చూస్తే.. సీఎం కేసీఆర్ మరోసారి లాక్‌డౌన్‌ను పొడిగించడానికే మొగ్గు చూపుతారని తెలుస్తోంది. అయితే ఈ నెల 27వ తేదీన ప్రధాని మోదీ అన్ని రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్న దృష్ట్యా.. ఆయన లాక్‌డౌన్ పొడిగింపుపై కూడా సీఎంలతో మాట్లాడుతారని తెలిసింది. ఇక మే 3వ తేదీ వరకు వేచి చూస్తేనే.. ఈ విషయంపై మనకు స్పష్టత వస్తుంది..!