‘‘సజ్జనార్ తొమ్మిదేళ్ల వయసప్పుడే తన తల్లిని కోల్పోయారు. దాంతో ఆయన కుటుంబంలోని ఆడవాళ్లతో బాగా అనుబంధం పెంచుకున్నారు. మహిళలను ఎంతో గౌరవంగా చూసుకుంటారు. ఆయన ఇద్దరు కూతుళ్లు తండ్రిని ఎంతగానే ఇష్టపడతారు’’. సజ్జనార్ గురించి ఆయన వదిన డాక్టర్ వినూత.
ప్రముఖ ఇంగ్లీషు మ్యాగజైన్, ‘ది వీక్’ తన సరికొత్త సంచికలో, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్‌పై ప్రధాన కథనం ప్రచురించింది, ‘‘రేప్ అండ్ ది కాప్’’ – ‘‘వై పీపుల్ ఆడోర్ కమిషనర్ సజ్జనార్’’ అనే శీర్షికతో కవర్ స్టోరీ ముద్రితమయింది.
విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్ – కుటుంబమంతా కర్ణాటకలోనే. గడగ్ జిల్లా, రోన్ తాలూకాలోని అసుతి వారి స్వగ్రామం. తర్వాత వారంతా హుబ్బళ్లి (హుబ్లీ)లోనే స్థిరపడ్డారు. తండ్రి చెన్పప్ప బసప్ప సజ్జనార్ టాక్స్ కన్నల్టెంట్ అయినప్పటికీ, తన ముగ్గురు తమ్ముళ్లతో కలిసి వంటనూనెల వ్యాపారం చేసేవారు. ‘‘వాళ్లమ్మ గిరిజ చనిపోయేనాటికి విశ్వనాథ్(సజ్జనార్)కు తొమ్మిదేళ్లు. నేనే ఈ మగ్గురు పిల్లలను నా ఇద్దరు పిల్లలతో సహా పెంచి వారికి కూడా అమ్మనయ్యాను’’ అంది వారి మేనత్త మల్లమ్మ. ఇద్దరు సోదరుల్లో ఇటీవలే ఒకరు చనిపోగా, మరో సోదరుడు మల్లిఖార్జున్, డాక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఈయన భార్య వినూత కూడా డాక్టరే.
మావాడు చాలా పద్ధతి కల మనిషి. తన నిజాయితీ, పట్టుదల, అంకితభావం ఎందరో రాజకీయనాయకుల మనసులను దోచుకున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డా. రాజశేఖర్‌రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పులివెందులకు తమ్ముడు డి.ఎస్.పీగా పనిచేసాడు. వైఎస్సార్ ఎంతగానే ఇష్టపడేవారు విశ్వనాథ్‌ను. తర్వాత, గుంటూరు, కడప, వరంగల్, ఆదిలాబాద్, మెదక్..ఇలా అన్ని నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లోనే ఎక్కుగా పనిచేసాడు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం అత్యున్నతమైన సైబరాబాద్ కమిషనర్ పదవి ఇచ్చి గౌరవించింది. మల్లిఖార్జున్ తన తమ్ముడి గురించి చెప్పిన మాటలివి.
సజ్జనార్ వ్యక్తిత్వం గురించి, మానసిక ధృడత్వం గురించి, అడపిల్లల పట్ల బాధ్యతను గురించి, ఆయన కుటుంబసభ్యులు ఈ కథనంతో వివరించే ప్రయత్నం చేసారు. సజ్జనార్ చేసే ప్రతీ పని వెనుక ఎంతో ఆలోచన ఉంటుందనేది వారి అభిప్రాయంగా పత్రిక తెలియజేసింది. అత్యాచారాలను ‘నేషనల్ షేమ్’ గా అభివర్ణించిన ది వీక్, ‘మీ కూతురే అయితే ఏం చేస్తారు’ అని సమాజాన్ని ప్రశ్నించింది. ఇందులో ఎవర్నీ నిందాల్సిన అవసరం లేదనీ, మనల్ని మనమే నిందించుకోవాలనే సందేశంతో చాలా సీరియస్‌గా కథనాన్ని వ్యక్తీకరించింది.