ఈ ఏడాది స్వాతంత్య్ర దినోత్సవాలను చారిత్రక గోల్కొండ కోటలో ఘనంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి తెలిపారు. ఈ వేడుక ఏర్పాట్లపై మంగళవారం రోజున సచివాలయంలో అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. గోల్కొండలో ఆగస్టు 15న ఉదయం 10.30 గంటలకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ పతాకావిష్కరణ చేస్తారని తెలిపారు. అంతకు ముందు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో అమరవీరుల స్మారక స్తూపం వద్ద స్వాతంత్య్ర సమరయోధులకు శ్రద్ధాంజలి ఘటిస్తారని వెల్లడించారు.
ఈ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖలు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. సమావేశంలో డీజీపీ అంజనీకుమార్, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌కుమార్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి జితేందర్, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వీ, జీఏడీ కార్యదర్శి శేషాద్రి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, రవాణాశాఖ కమిషనర్ జ్యోతి బుద్ధప్రకాష్, సమాచార శాఖ కమిషనర్ అశోక్‌రెడ్డి, సమాచార శాఖ డైరెక్టర్ రాజమౌళి, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.