తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సంబురం నేటితో షురూ కానుంది. ఇవాళ్టి నుంచి 21 రోజుల పాటు రాష్ట్రంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు అట్టహాసంగా జరగనున్నాయి. నేటితో తెలంగాణ రాష్ట్రం తొమ్మిదేళ్లు పూర్తి చేసుకుని పదో వసంతంలోకి అడుగుపెడుతోంది. ఈ నేపథ్యంలో 21 రోజుల పాటు రోజుకో రంగం చొప్పున ప్రత్యేక కార్యక్రమాలతో దశాబ్ది ఉత్సవాలు నిర్వహించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఇవాళ కొత్త సచివాలయంలో సీఎం కేసీఆర్ దశాబ్ది వేడుకను ప్రారంభించనున్నారు. సచివాలయ ప్రారంభం తర్వాత జరుగుతున్న తొలి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లుచేశారు. 15వేల మందికి సరిపడేలా ఏర్పాట్లు చేశారు.
మొదట గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పిస్తారు. అనంతరం ఉ.10.30గం.కు సచివాలయంలో జాతీయ పతాక ఆవిష్కరిస్తారు. అనంతరం తెలంగాణ ప్రగతి ప్రస్థానంపై కేసీఆర్ ప్రసంగిస్తారు. మరోవైపు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ప్రముఖులు ధశాబ్ది వేడుకలను ప్రారంభిస్తారు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. గ్రామగ్రామాన రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకలు ఘనంగా జరగనున్నాయి.