ఎలా పుట్టామన్నది కాదు.. ఎలా బతికాము అన్నది ముఖ్యం..పుట్టేప్పుడు పేదవాడిలా పుట్టవచ్చు..కానీ పోయేప్పుడు కూడా అదే స్థాయిలో ఉంటే.. నువ్వు నీ జీవితంలో చేసిందేంటి..? అనే ప్రశ్నకు నువ్వే సమాధానం చెప్పాలి.. అందుకే జీవితం దేవుడి ఇచ్చాడు.. దాన్ని నీకు నచ్చినట్లు మాల్చుకోవడం నీ చేతుల్లోనే ఉంది. ఈ ప్రపంచంలో ఒక్క రోజుకే కోట్లు సంపాదించే వాళ్లు ఉన్నారు..అదే ఒక్క రోజు 450 రూపాయల కూలీ సంపాదించేవాళ్లు ఉన్నారు. కాలం ఇద్దరికీ సమానమే..కానీ వారి కాలం విలువే వేరు.. పదేళ్ల వయసులోనే ఇంట్లోంచి బయటకు వచ్చేసి రోడ్లుపై పడుకుంటూ పానిపూరి అమ్మేవారి జీవితం ఎలా ఉంటుంది..ఇంకో పదేళ్లు అయినా పెద్దగా మార్పు రాదు అనుకుంటారు..ఎందుకంటే.. చెప్పేవాళ్లు లేరు..చదువు లేదు..అంతకుమించి ఏం మార్పు జరుగుతుంది..? మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ఎత్తైన భవనాలు చూసి పెద్దయ్యాక ఇలాంటిది ఒకటి కొనాలి అని మీరు అనుకునే ఉంటాం..ఆ కుర్రాడు కూడా చిన్నతనంలో ముంబాయిలో ఒక మంచి ఇళ్లు కొనాలి అనుకున్నాడు.. ఇప్పుడు ఏకంగా 5 కోట్లు పెట్టి ఐదు పడకల ఇళ్లే కొనేశాడు.. ఇంతకీ ఎవరా అనుకుంటున్నారా.? మీ అందరికీ తెలిసిన వ్యక్తే..కానీ అతని ప్రయాణం మీరు ఎరుగకపోవచ్చు..
యశస్వి జైస్వాల్.. క్రికెట్ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు ఇది. టెస్టుల్లో వరుసగా ద్విశతకాలు బాదేస్తూ.. రికార్డుల దుమ్ము దులుపుతున్నాడు. చిన్నప్పుడే టీమిండియాకు ఆడాలన్న లక్ష్యంతో ఒంటరి పోరాటం చేసిన వీరుడు యశస్వి.. మనం వారం క్రితం పెట్టుకున్న గోల్‌నే వారం అయిపోయాక మర్చిపోతాం.. కానీ ఇతను మాత్రం.. సాధించేందుకు ఎలాంటి మార్గాలు లేకపోయినా.. పెద్ద లక్ష్యాన్ని చిన్నప్పుడే ఫిక్స్ చేసుకుని ఏళ్లపాటు శ్రమించాడు. పట్టుపరుపులు, పూలపాన్పుల సుఖం తనకు తెలియదు.. అయినా అలుపెరగని పోరాటం చేసిన ఎదురులేని శక్తిగా ఎదిగాడు. మన లక్ష్యం గట్టిదైతే.. ఎలాంటి పరిస్థితులు మనల్ని ఆపలేవు అనడానికి గొప్ప ఉదాహరణ యశస్వి జైస్వాల్.
అతనెన్నో ఎదురు దెబ్బలు తిన్నాడు. ఎన్నో అడ్డంకులు దాటాడు. క్రికెట్ ఆడతానంటే తల్లిదండ్రులు వద్దన్నారు. తండ్రి చేయి చేసుకున్నాడు. కానీ ఆటంటే ప్రాణం. అందుకే ఉత్తర్‌ప్రదేశ్ నుంచి కట్టుబట్టలతో పెద్దగా ఏమీ తెలియని వయసులోనే ముంబయికి వచ్చేశాడు. డబ్బులు లేక పస్తులున్నాడు. డెయిరీలో పనికి కుదిరినా.. ఆటపై ధ్యాసతో సరిగ్గా పని చేయడం లేదంటూ అతణ్ని వద్దన్నారు. ఎక్కడ ఉండాలో తెలియక ఆజాద్ మైదానంలోని టెంట్లో పడుకున్నాడు. అక్కడే పానీపూరీ అమ్మాడు. ఇలా ఎన్నో కష్టాలు.. ఒక్క రోజు కాదు రెండు రోజులు కాదు.. మూడేళ్ల పాటు ఇవే ఇబ్బందులు. కానీ సాధించాడు. అందుకు కారణం.. అతని బలమైన సంకల్పం.. సంకల్పం గట్టిదైతే.. విజయం లేటు అయినా వరించకతప్పదంటే ఇదేనేమో..!
యశస్వికి ఏ చిన్న అవకాశం వచ్చినా రెండు చేతులా అందిపుచ్చుకున్నాడు. దేశవాళీల్లో ముంబయి తరపున రాణించాడు. 17 ఏళ్లకే లిస్ట్- ఎ క్రికెట్లో డబుల్ సెంచరీ చేసి, ఆ ఘనత సాధించిన పిన్న వయస్సు ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. 2020 అండర్-19 ప్రపంచకప్‌లో దేశానికి ప్రాతినిథ్యం వహించే అవకాశాన్ని కూడా వదల్లేదు.. ఆ టోర్నీలో అత్యధిక పరుగుల చేసిన (400) వీరుడు అతడే. దీంతో అదే ఏడాది ఐపీఎల్‌లో రాజస్థాన్ రాయల్స్ అతణ్ని తీసుకుంది. ఆ జట్టు తరపున లీగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. గతేడాది ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన అర్ధశతకం బాదాడు. ఇక టీమ్‌ఇండియాకు ఆడాలనే స్వప్నం 2023 వెస్టిండీస్ పర్యటనలో సాకారమైంది. టెస్టులతో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు.ఇప్పుడు ఇంగ్లాండ్‌తో వరుసగా రెండు టెస్టుల్లో ద్విశతకాలు బాదాడు. ఇప్పటివరకూ 7 టెస్టుల్లో 71.75 సగటుతో 861 పరుగులు చేశాడు. 17 టీ20ల్లో 161.93 స్ట్రైక్‌రేట్‌తో 502 పరుగులు సాధించాడు.
కొందరు తాము అనుకున్నది సాధించాక.. రిలాక్స్ అవుతారం. అలా అయితే..మీరు ఇన్ని ఏళ్లు పడిన కష్టం వృద్ధా అవుతుంది. ప్రపంచం మనల్ని గుర్తెరగనప్పుడు ఎన్ని కష్టాలు పడినా, ఓటమి ఎదుర్కొన్నా అది నీకు తప్ప ఎవరికీ తెలియదు..కానీ ఒక స్థాయికి వచ్చాకా ఆ స్థానాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం..ఏ చిన్న పొరపాటు జరిగినా అది దహనంలా వ్యాపిస్తుంది. ఐపీఎల్‌లో సత్తాచాటిన ఎంతో మంది టీమ్ ఇండియాలోకి వచ్చినా.. నిలకడ లేక మరుగున పడ్డారు. కానీ యశస్వి అలా కాదు. అతని కసి వేరు. నిరంతరం మెరుగవాలనే తపనతో సాగుతున్నాడు. మ్యాచ్ ఉన్నా లేకపోయినా సాధన కొనసాగిస్తాడు. ఒక షాట్‌ను పరిపూర్ణంగా ఆడేంతవరకూ ఎన్ని గంటలైనా సరే ప్రాక్టీస్ చేస్తాడు. ఆగిపోవడం, అలసి పోవడం అతని తెలియని పదాలు.
ఒకప్పుడు వినోద్ కాంబ్లి, ఈ తరంలో పృథ్వీ షా లాంటి ఆటగాళ్లు ఆరంభంలో సత్తాచాటి ఆ తర్వాత మరుగున పడ్డారు.. ఇప్పుడు యశస్వికి 22 ఏళ్లే. అతను స్థిరంగా నిలబడితే.. డబ్బు, పేరు, ప్రఖ్యాతులు దాటి సాగితే మరో భారత సూపర్‌స్టార్ అవుతాడు. యశస్వి అంటే విజయవంతమైన అని అర్థం. యశస్వి ఇదే తపనతో, సంకల్పంతో సాగితే సార్థక నామధేయుడు అవుతాడు.