కరోనా కేసుల సంఖ్య దేశంలో రోజు రోజుకీ పెరిగిపోతున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనాను కట్టడి చేయడానికి కావల్సిన అన్ని చర్యలను తీసుకుంటున్నాయి. ఇక కరోనాపై ప్రజలకు ఎప్పటికప్పుడు సమాచారం అందించేందుకు పలు వెబ్‌సైట్లు, హెల్ప్‌లైన్ నంబర్లను కూడా కేంద్రం అందుబాటులో ఉంచింది. అయితే దేశంలో చాలా మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్లను ఉపయోగిస్తున్న నేపథ్యంలో వారికి అందుబాటులో ఉండేందుకు గాను కేంద్ర ప్రభుత్వం తాజాగా కోవిడ్-19 ట్రాకింగ్ యాప్‌ను లాంచ్ చేసింది.
కేంద్ర ప్రభుత్వం కోవిడ్-19 వివరాలను ప్రజలు తెలుసుకునేందుకు గాను ఆరోగ్య సేతు (Aarogya Setu) పేరిట ఓ నూతన యాప్‌ను లాంచ్ చేసింది. దీన్ని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ శాఖ రూపొందించింది. ఇందులో కోవిడ్ – 19 కేసుల సంఖ్య తదితర వివరాలతోపాటు అన్ని రాష్ట్రాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్‌లైన్ నంబర్లు ఉంటాయి. అలాగే ఈ యాప్ కరోనా పాజిటివ్ ఉన్న వారు, వారి చుట్టు పక్కల ఉన్నవారి వివరాలను కేంద్రానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది. అయితే ప్రజల పేర్లు, ఫోన్ నంబర్లను మాత్రమే కేంద్రం సేకరిస్తుంది.. కానీ ఈ డేటాను ప్రైవేటు వ్యక్తులు, సంస్థలతో కేంద్రం పంచుకోదు.
ఇక ఈ యాప్ లో ఒక ప్రత్యేకమైన చాట్‌బాట్‌ను కూడా అందిస్తున్నారు. దీని సహాయంతో ప్రజలు కరోనా వైరస్ లక్షణాలు తదితర వివరాలను తెలుసుకోవచ్చు. తమకు ఉన్న సందేహాలను వారు నివృత్తి చేసుకోవచ్చు. ఇక కరోనా కేసులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్లను ఇందులో అందిస్తారు. అలాగే ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్లు ఉన్నవారు ఈ యాప్‌లో ఎప్పటికప్పుడు కేంద్ర ఆరోగ్యశాఖ పోస్ట్ చేసే ట్వీట్లను చదవవచ్చు. ఇక ఈ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ ప్లాట్‌ఫాంలపై ప్రజలకు లభిస్తోంది.