ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్న కరోనా వైరస్ మన దేశంలోనూ నెమ్మదిగా చాప కింద నీరులా వ్యాప్తి చెందుతోంది. కోవిడ్-19 వైరస్ బారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతోంది. కాగా బెంగళూరులోని గూగుల్ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి కరోనా ఉన్నట్లు తేలింది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
బెంగళూరులోని తమ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా ఉన్నట్లు నిర్దార్ణ అయిందని గూగుల్ స్వయంగా వివరాలు వెల్లడించింది. ఈ క్రమంలోనే ఆ ఉద్యోగిని ప్రత్యేకంగా గదిలో ఉంచినట్లు గూగుల్ తెలిపింది. అలాగే అతనితో సన్నిహితంగా ఉన్న ఉద్యోగులను కేవలం ఇంటి వద్దే ఉండాలని, ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వెంటనే హాస్పిటల్‌కు వెళ్లాలని గూగుల్ సూచించింది.
ఇక కరోనా ప్రభావం వల్ల గూగుల్ తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని ఆదేశించినట్లు తెలిపింది. అందులో భాగంగానే ఇప్పటికే అమెరికా, యూరప్‌లలోని కార్యాలయాల్లో తమ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తున్నారని గూగుల్ వెల్లడించింది. ఇక బెంగళూరులో ఉన్న గూగుల్ ఉద్యోగులు కూడా ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తున్నారు.