దేశంలో కొవిడ్-19 కేసులే నమోదు కాలేదంటారేమో?

-

న్యూఢిల్లీ: కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించినట్లు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నివేదించలేదని కేంద్ర ప్రభుత్వం ప్రకటన చేయడంపై ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ తీవ్ర విమర్శలు చేశారు. దేశంలో అసలు కొవిడ్-19 కేసులే నమోదు కాలేదని త్వరలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ఎద్దేవా చేశారు. ఒకవేళ ఆక్సిజన్ కొరత కారణంగా మరణాలు సంభవించకపోతే, ప్రాణవాముయు అందుబాటులో లేదని హాస్పిటళ్లు హైకోర్టును ఎందుకు ఆశ్రయిస్తాయని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వ వాదన పూర్తి సత్య దూరమని సత్యేంద్ర జైన్ ఆరోపించారు.

ప్రత్యేకంగా ఆక్సిజన్ కొరత కారణంగానే కొవిడ్ బాధితులు మృతిచెందారని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నివేదించలేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ మంగళవారం రాజ్యసభకు తెలిపారు. ఏదిఏమైనా కొవిడ్-19 సెకండ్ వేవ్‌లో మెడికల్ ఆక్సిజన్‌కు డిమాండ్ ‘ఉప్పెనలా’ సంభవించిందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

గడిచిన 24 గంటల్లో (బుధవారం ఉదయం 8గంటల వరకు) దేశంలో కొత్తగా 42,105 కరోనా కేసులు వెలుగు చూశాయి. 3,998 మంది మృతిచెందారు. మొత్తం కొవిడ్ కేసులు 3,12,16,337 చేరుకున్నాయి. మంగళవారం 37,000 మంది కోలుకున్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. గడిచిన 30 రోజులుగా డెయిలీ పాజిటివిటీ రేటు 3శాతం కంటే తక్కువగా నమోదు కావడం గమనార్హం.

అసోంలో ఓ వైద్యురాలికి ఒకేసారి డెల్టా, అల్ఫా వైరస్‌లు సోకాయి. ఒకే వ్యక్తికి ఏకకాలంలో రెండు వేరియంట్లు సోకడం ఇదే తొలిసారి. ఆ వైద్యురాలికి స్వల్ప లక్షణాలు ఉండటంతో హాస్పిటల్‌కు తరలించాల్సిన అవసరం ఏర్పడలేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version