క‌రోనా ఎఫెక్ట్‌.. క్వారంటైన్ కేంద్రంగా మారనున్న హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి స్టేడియం..!

-

క‌రోనా వైర‌స్ వ్యాప్తిని అడ్డుకునేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అన్ని ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే. అందులో భాగంగానే మార్చి 31వ తేదీ వ‌ర‌కు జ‌న స‌మ్మ‌ర్థం ఎక్కువ‌గా ఉండే ప్ర‌దేశాల‌ను మూసివేశారు. సినిమా హాల్స్‌, మాల్స్‌, స్కూళ్లు, కాలేజీలు, జిమ్‌లు, ప‌బ్‌లు, బార్ల‌ను మూసివేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. కాగా క‌రోనా వైర‌స్ అనుమానితుల‌కు, వైర‌స్ ఉన్న‌వారికి చికిత్స అందించేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం కొత్త‌గా గ‌చ్చిబౌలి స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా ప్ర‌క‌టించింది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలోని శేరిలింగంప‌ల్లి గ‌చ్చిబౌలి స్టేడియాన్ని క్వారంటైన్ కేంద్రంగా మారుస్తున్నామ‌ని తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ఇందులో భాగంగానే స్టేడియాన్ని ఇప్ప‌టికే స్థానిక పారిశుద్ధ్య సిబ్బంది సిద్ధం చేశారు. స్టేడియంలోని అథ్లెటిక్ క్రీడా ప్రాంగ‌ణంలో ఉన్న ప‌రిపాల‌న విభాగంతోపాటు అందుబాటులో ఉన్న గ‌దుల‌ను క్వారంటైన్ కేంద్రం కోసం ఉప‌యోగించ‌నున్నారు. ఈ క్ర‌మంలో స్టేడియంలో మొత్తం 50 ప‌డ‌క‌ల‌ను ఏర్పాటు చేయ‌నున్నారు.

ఇక వైద్యాధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు ఇప్ప‌టికే స్టేడియాన్ని ప‌రిశీలించారు. శేరిలింగంప‌ల్లి స‌ర్కిల్ 11 పారిశుద్ధ్య సిబ్బంది స్టేడియంలో ప‌నులు నిర్వ‌హిస్తున్నారు. దీంతో మ‌రో 2 రోజుల్లో స్టేడియం క్వారంటైన్ కేంద్రంగా మారనుంది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి క‌రోనా అనుమానితుల‌ను నేరుగా స్టేడియంకు త‌ర‌లించి అందులో వారిని ప‌రిశీల‌న‌లో ఉంచే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version