ఇటలీలో కరోనా వైరస్ చాలా వేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ఆ దేశ ప్రభుత్వం చాలా కఠిన చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. కరోనా లేదని సర్టిఫికెట్ తెస్తేనే అక్కడ ఉన్న వారిని విమానాల్లో సొంత దేశాలకు ప్రయాణించేందుకు అనుమతినిస్తామని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఈ నిబంధన వల్ల రోమ్ ఎయిర్‌పోర్టులో 70 మంది భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. కరోనా లేదని ధ్రువపత్రం తెస్తేనే వారిని ఇండియా వెళ్లేందుకు విమానాల్లోకి అనుమతిస్తామని అక్కడి అధికారులు చెబుతున్నారు.
రోమ్‌లో వైద్య విద్య (ఎంఎస్) పూర్తి చేసిన సుమారు 70 మంది విద్యార్థులు చిక్కుకుపోయారు. ఇండియాకు వచ్చేందుకు వారికి విమానయాన సంస్థలు బోర్డింగ్ పాస్‌లను ఇవ్వడం లేదు. ఎమిరేట్స్ ఎయిర్‌లైన్స్, ఎయిరిండియా విమాన సంస్థలు వారికి బోర్డింగ్ పాసులను ఇచ్చేందుకు నిరారిస్తున్నాయి. కరోనా సోకలేదని మెడికల్ సర్టిఫికెట్ తేవాలని, లేకపోతే విమానాల్లో ప్రయాణానికి అనుమతించబోమని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో ఆ విద్యార్థులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు.
మరోవైపు ఆ విద్యార్థులు ఇప్పటికే కొన్ని గంటల నుంచి విమానాశ్రయంలో చిక్కుకుపోగా వారికి కనీసం వసతి, భోజన సదుపాయాలు కూడా కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోమ్ విమానాశ్రయంలో చిక్కుకున్న తమను రక్షించాలని, సొంత దేశానికి వచ్చేందుకు ఏర్పాటు చేయాలని.. వారు ప్రధాని మోడీని కోరుతున్నారు.