ఓ వైపు నెలలు గడుస్తున్నా.. మరోవైపు కరోనా మహమ్మారి ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. ఈ క్రమంలోనే వర్షకాలం వచ్చేసింది. దీంతో బాక్టీరియా, వైరస్‌లు దాడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి. అసలే ఇది విష జ్వరాలు ప్రబలే సీజన్. డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ఎక్కువగా వస్తాయి. ఈ క్రమంలో కరోనాకు తోడు ఈ వ్యాధులు ఇప్పుడు జనాలను మరింత భయపెడుతున్నాయి. ఇక వైద్యులు కూడా ఇదే విషయంపై ఆందోళన చెందుతున్నారు. విష జ్వరాల బారిన పడిన వారికి కరోనా ఉంటే దాన్ని గుర్తించడం కష్టతరమవుతుందని వారంటున్నారు.
డెంగ్యూ వంటి విషజ్వరాలు వచ్చిన వారికి కరోనా ఉంటే.. దాన్ని నిర్దారించడం కష్టతరమవుతుందని సింగపూర్‌కు చెందిన పరిశోధకులు తేల్చారు. తాజాగా డెంగ్యూ వచ్చిన ఇద్దరు పేషెంట్లకు కరోనా టెస్టులు చేయగా.. అవి నెగెటివ్ వచ్చినట్లు గుర్తించారు. కొద్ది రోజులకు పరిస్థితి తీవ్రతరం అయ్యాక.. అప్పుడు టెస్టులు చేస్తే కరోనా పాజిటివ్ వచ్చిందని తెలిపారు. ఈ క్రమంలో డెంగ్యూ వచ్చిన పేషెంట్లకు కరోనా కూడా ఉంటే ఆరంభంలో దాన్ని గుర్తించడం కష్టతరమవుతుందని, పరిస్థితి తీవ్రతరం అయ్యే వరకు వ్యాధి బయట పడడం లేదని తెలిపారు. ఈ మేరకు లాన్సెట్ రిపోర్టు కూడా విడుదలైంది.
అయితే సీజనల్ వ్యాధులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటే వాటి నుంచి కొంత వరకు రక్షణ లభిస్తుందని, కానీ విష జ్వరాలు వచ్చిన వారికి కరోనా సోకితే.. ఇబ్బందికర పరిణామాలు ఏర్పడే అవకాశం ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. మరి దీనిపై ప్రభుత్వాలు ఏం చేస్తాయో చూడాలి.