చైనా ధ‌నికుడు జాక్ మా విత‌ర‌ణ‌.. యూర‌ప్‌, అమెరికాల‌కు 15 ల‌క్ష‌ల మాస్క్‌ల పంపిణీ..!

-

చైనా బిలియ‌నీర్, అలీబాబా గ్రూప్ య‌జ‌మాని జాక్ మా త‌న దాతృత్వాన్ని ప్ర‌ద‌ర్శించారు. క‌రోనాతో వ‌ణుకుతున్న యూరప్ దేశాల‌కు ఆయ‌న త‌న జాక్ మా ఫౌండేష‌న్ త‌ర‌ఫున‌ 5 ల‌క్ష‌ల మాస్క్‌ల‌ను పంపించారు. ఈ క్ర‌మంలో ఆ మాస్క్‌లు ఇప్ప‌టికే బెల్జియం దేశానికి చేరుకున్నాయ‌ని జాక్ మా ఫౌండేష‌న్ తెలిపింది. కాగా జాక్ మా రాసిన ఓ లెట‌ర్‌ను ఆ ఫౌండేష‌న్ త‌న ట్విట్ట‌ర్ ఖాతాలో షేర్ చేసింది.

ఇక యూర‌ప్‌కు కాకుండా అమెరికాకు మ‌రో 10 ల‌క్ష‌ల మాస్కుల‌తోపాటు 5 ల‌క్ష‌ల కరోనా వైర‌స్ టెస్టింగ్ కిట్‌ల‌ను పంప‌నున్న‌ట్లు జాక్ మా త‌న లెట‌ర్‌లో తెలిపారు. ప్ర‌స్తుతం క‌రోనా వైర‌స్ ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌జ‌ల‌పై దాడి చేస్తుంద‌ని, క‌నుక మ‌న‌మంతా ఒక్క‌టై ఆ వైర‌స్‌ను ఎదుర్కోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. అలాగే చైనాలో వైర‌స్‌ను అడ్డుకునేందుకు ఉప‌యోగించిన అధునాత‌న సాంకేతిక ప‌ద్ధ‌తుల‌ను ఇత‌ర దేశాల్లోనూ అనుస‌రించాల‌ని ఆయ‌న అన్నారు. అప్పుడే క‌రోనాకు అడ్డుక‌ట్ట వేయ‌గ‌ల‌మ‌ని తెలిపారు.

కాగా జ‌పాన్‌, ద‌క్షిణ కొరియా, ఇట‌లీ, ఇరాన్‌, స్పెయిన్‌ల‌లో ఇప్ప‌టికే త‌మ ఫౌండేష‌న్ క‌రోనా బాధితుల‌కు స‌హాయం అందిస్తుంద‌ని జాక్ మా తెలియ‌జేశారు. క‌రోనా వైర‌స్‌ను ఢీకొట్టేందుకు మ‌న‌మంద‌రం మ‌న దేశాల స‌రిహ‌ద్దుల‌ను చెరిపివేసుకోవాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌మైంద‌ని ఆయ‌న అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version