పెరుగుతున్న కరోనా కేసులు… హైకోర్టు అసంతృప్తి

-

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇటు తెలంగాణలో కూడా కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితులపై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ సందర్భంగా రాష్ట్రంలో కరోనా పరీక్షలు, నియంత్రణ, చికిత్స తదితర వివరాలకు సంబంధించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వం సమర్పించింది. ఇక రాష్ట్రంలో కరోనా టెస్టులపై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

ర్యాపిడ్‌ టెస్టులపై ఎక్కువ దృష్టి పెట్టి ఆర్టీపీసీఆర్‌ పరీక్షల సంఖ్య తగ్గించడంపై ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. మొత్తం పరీక్షలలో ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు 10 శాతం కూడా లేవని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆర్టీపీసీఆర్‌ టెస్టులను నెమ్మదిగా పెంచుతున్నట్లు ప్రభుత్వ తరపున న్యాయవాది ధర్మాసనానికి చెప్పగా .. ఓ వైపు రెండో దశ కరోనా వేగంగా విస్తరిస్తుంటే ఇంకా నెమ్మదిగా పెంచడమేంటని ప్రశ్నించింది. అలానే ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు పెంచాలని ఆదేశిస్తూ… రాష్ట్ర ప్రభుత్వానికి పలు సూచనలు చేసింది.

వివాహాది శుభాకార్యక్రమాలు సహా అంత్యక్రియల లాంటి కార్యక్రమాల్లో జనం గుమిగూడకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. రాష్ట్రంలో కరోనా చికిత్స కేంద్రాల వివరాలపై విస్తృత ప్రచారం చేయాలని పేర్కొంది. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇతర రద్దీ ప్రాంతాల్లో కరోనా పరీక్షల వివరాలు తెలపాలని, కరోనా నిబంధనలు పాటించని తీసుకుంటున్న చర్యలు, నమోదైన కేసులు, జరిమానాల వివరాలు వెల్లడించాలని… వీటికి సంబంధించి 48 గంటల్లో నివేదిక సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.  పబ్‌లు, బార్లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో తెలపాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version