మరోసారి ప్రపంచం ప్రమాదం ముంగిట నిలుస్తోంది. ఇప్పుడిప్పుడే ఓమిక్రాన్ ప్రభావం తగ్గుతుందనుకునే సమయంలో పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చైనా, దక్షిణ కొరియాల్లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణ కొరియాలో కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది. గడిచిన 24 గంటల్లో దక్షిణ కొరియాలో6,21,328 కొత్త కేసులు నమోదయ్యాయి. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 82 లక్షలకు చేరుకుంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా పెరిగింది. తాజాగా కరోనాతో 429 మంది మరణించారు. ఒక రోజులో ఇన్ని మరణాలు నమోదుకావడం ఇదే తొలిసారని అక్కడి ప్రభుత్వం తెలిపింది.
దక్షిణ కొరియాలో ఆంక్షలు ఎత్తేయడంతో కేసుల సంఖ్య ఎక్కువ అవుతోంది. కేసులు సంఖ్య పెరిగినా… కొరియా ప్రభుత్వం ఆంక్షలు విధించే పరిస్థితి కనిపించకపోగా… మరింత సడలింపులు ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే చైనాలో కూడా కరోనా కేసుల సంఖ్య పెరిగింది. దాదాపు 13 నగరాల్లో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఇదిలా ఉంటే ఆంక్షల సడలింపులతో కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.