కరోనా వైరస్.. ఇప్పటికే 20కి పైగా దేశాలకు వ్యాపించింది. ఇది ఇంకా ఎన్ని దేశాలకు వ్యాపిస్తుందో, ఇంకెంతమంది దీని బారిన పడతారో అర్థంకాని పరిస్థితి. చైనాలోని వూహాన్ నగరంలో పుట్టిన ఈ వైరస్.. చైనానే కాదు యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. కరోనా పేరు వింటేనే ప్రజల వెన్నులో వణుకు పుట్టుకొస్తోంది. మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు. వందల సంఖ్యలో మృత్యువాత పడ్డారు. వేల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఇటీవల కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోందని చైనా ప్రకటించినప్పటికీ… ప్రపంచ దేశాలు ఆ ప్రకటనను విశ్వసించడం లేదు. అయితే కరోనా ఎఫెక్ట్ వల్ల శుక్రవారం నాడు జరుపుకోనున్న వాలంటైన్స్ డే సందర్భంగా ప్రేయసీప్రియులు, దంపతులు ముద్దూ ముచ్చట్లను కట్ చేసుకుంటే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రబలుతున్న దృష్ట్యా ప్రేయసీప్రియులు, దంపతులు బయట ప్రేమికుల దినోత్సవం జరుపుకోవడం ప్రమాదకరమని వైద్యనిపుణులు హెచ్చరించారు. వాలంటైన్స్ డే సందర్భంగా రెస్టారెంట్లకు జంటగా డిన్నర్లకు వెళ్లడం సర్వసాధారణమే అయినా వైరస్ ప్రబలుతున్నందున ఇంట్లోనే ఇద్దరూ కలిసి స్పెషల్ వంటకాలు చేసుకొని ఒకరికొకరు ప్రేమతో భోజనం చేయాలని నిపుణులు సూచించారు. ప్రేమికుల దినోత్సవం రోజు సినిమా థియేటరుకు వెళ్లి కలిసి సినిమా చూస్తుంటారని కాని, ఇంట్లోని హోం థియేటరులోనే నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్, హాట్ స్టార్ లలో సినిమా చూడవచ్చని సూచిస్తున్నారు. సో.. బీకేర్‌ఫుల్..!