అతడు.. 19 ఏళ్లు కోమాలో ఉండి లేచాడు.. తర్వాత ఏమైంది..?

అనారోగ్యం ముదిరితే.. కొందరు కోమాలోకి వెళ్లిపోతారు. అంటే.. కేవలం ప్రాణం మాత్రమే ఉంటుంది తప్ప.. ఆ మనిషి మరణించినట్టే లెక్క. ఇలా కోమాలోకి వెళ్లి మళ్లీ బతికినవారూ ఉన్నారు. సాధారణంగా కోమాలోకి వెళ్లిన కొన్ని రోజుల్లో వైద్యుల కృషి వల్ల కొందరు కోలుకుని మామూలు మనుషులవుతారు .

కానీ ఏకంగా కోమాలో ఏళ్ల తరబడి ఉండటం మాత్రం చాలా అరదు. కానీ పోలండ్ లో ఓ వ్యక్తి దాదాపు 19 ఏళ్ల పాటు కోమాలో ఉండిపోయాడు. దీర్ఘనిద్ర కోమాలోకి వెళ్లినవారు ఇక బతకరని వైద్యులు తరచూ చెబుతుంటారు. చాలా సందర్భాల్లో అది నిజం అవుతుంటుంది. కానీ పోలండ్ కు చెందిన జాన్ గెజ్ చిస్కీ విషయంలో అలా జరగలేదు.

రైల్వే శాఖలో పనిచేసే జాన్ ఒకరోజు రెండు రైలు పెట్టెలను కలుపుతుండగా తలకి పెద్ద దెబ్బ తగిలింది. అతడ్ని హాస్పిటల్‌కు తరలించారు. పరీక్షల్లో అతనికి బ్రెయిన్ కేన్సర్ ఉందన్న సంగతి కూడా బయటపడింది. అతను కోమాలోకి వెళ్లిపోయాడు. మూడేళ్లు గడిచాక ఇక అతను అట్టేకాలం జీవించడని వైద్యులు చెప్పారు.

కాని అతని భార్య గెట్రూ మాత్రం ధైర్యం కోల్పోకుండా నిత్యం అతని దగ్గరకి వెళ్లి మాట్లాడుతూ గడపసాగింది. గొంతులోని నాళాల ద్వారానే అతనికి ఆహారాన్ని అందించారు. అలా పందొమ్మిదేళ్లు కోమాలో ఉన్నాక.. ఓ రోజు జాన్ అందులోంచి బయటకి వచ్చి అందర్నీ ఆశ్చర్యపరిచాడు.

తన కుటుంబ సభ్యులను ఆనందపరిచాడు. ఏప్రిల్ 12, 2007న అతను కోమా లోంచి బయటికి వచ్చాక గుర్తించిన ప్రధాన మార్పు పోలండ్ రష్యన్ కమ్యూనిజం నుంచి బయటికి వచ్చి ప్రజాస్వామ్య రాజ్యంగామారడం. అతనికి పదకొండు మంది మనవలు, మనవరాళ్లు ఉన్నారు. ఇలా దాదాపు ప్రతి రంగంలోనూ జాన్ గ్రేజ్ చిస్కీకి ఆశ్చర్యాన్ని కలిగించే మార్పులు కనిపించాయి.