తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణన మీద ప్రవేశపెట్టిన నివేదిక పూర్తిగా తప్పుల తడకగా ఉంది. ఈ నివేదిక వాస్తవాలకు దూరంగా ఉంది అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా.. సర్వేలో బీసీల శాతాన్ని తగ్గించి చూపించారు. బీసీలను రాజకీయంగా అణచివేసేందుకు వేసిన చర్యగానే దీన్ని భావించాలి. ఇది కాంగ్రెస్ మానసిక ఆలోచనకు అద్దం పడుతోంది. హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని పేర్కొన్నారు.12% ముస్లింల జనాభాను చూపిస్తూ.. 2% ముస్లిం బీసీలు, ముస్లిం ఓసీలు అని చూపించడం దేనికి నిదర్శనం.
ముస్లింలను సంతుష్టి పరిచేందుకు.. బీసీల హక్కులను కాలరాసే ప్రయత్నం చేస్తున్నారు. బీసీల హక్కును ముస్లింలకు కట్టబెట్టే ప్రయత్నం జరుగుతుంది. రాహుల్ గాంధీ సమక్షంలో గతేడాది నవంబర్ 6న ఈ సర్వేను ప్రారంభించారు. ఈ సర్వే దేశానికి ఓ రోల్ మాడల్ అని చెప్పారు. అయితే బీసీల ఓట్లను తగ్గించి ముస్లింలకు కట్టబెట్టడమే రోల్ మోడలా. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో 150 సీట్లలో 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేస్తే.. ఇందులో 18 మాత్రమే బీసీలకు ఇచ్చి మిగిలినవి ముస్లింలకు కట్టబెట్టడం అత్యంత దారుణం. సీఎంగా రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు.. ముస్లింలకు సంబంధించిన 14 కులాలను బీసీలుగా పరిగణిస్తూ.. బీసీలకు దక్కాల్సిన వాటాను ముస్లింలకు కట్టబెట్టారు. సోనియా గాంధీ కూడా సొంతగా నిర్ణయం తీసుకుని దేశవ్యాప్తంగా 27% బీసీ రిజర్వేషన్లలో 4% తొలగించి ముస్లింలకు ఇస్తే.. కోర్టు కొట్టేసింది అని గుర్తు చేసారు ఎంపీ లక్ష్మణ్.