కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్.. అని ఓ కవి అన్నాడు కానీ.. ఇక్కడ మాత్రం పెద్ద పొరపాటు జరిగిపోయింది. ఓ మహిళకు ఎడమ కాలుకు గాయమైతే.. కుడి కాలుకు ఆపరేషన్ చేశారు డాక్టర్లు. నిన్నగాక మొన్ననే కదా హైదరాబాద్‌లోని నిమ్స్‌లో వైద్యులు ఓ మహిళ కడుపులో కత్తెర మరిచిపోయారని చదువుకున్నాం. మళ్లీ ఇప్పుడు ఇంకో ఘటన. ఇలా.. చికిత్స సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది.
ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకున్నది. మితారాణి జేనా అనే మహిళ ఎడమ కాలుకు ప్రమాదవశాత్తు గాయమైంది. దీంతో ఆమెను ఆనంద్‌పూర్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో అక్కడి వైద్యులు ఆమెకు ఆపరేషన్ చేయాలన్నారు. దానికి కుటుంబ సభ్యులు ఒప్పుకున్నారు. వెంటనే జేనాను ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లి ఆపరేషన్ చేశారు. ఆమెకు స్పృహ వచ్చాక చూసుకుంటే డాక్టర్లు ఎడమ కాలుకు కాకుండా.. కుడి కాలుకు ఆపరేషన్ చేశారు. ఈ ఘటనపై వెంటనే డాక్టర్లను నిలదీయగా.. ఆమె ఎడమ కాలుకు మళ్లీ ఆపరేషన్ చేశారు. తన రెండు కాళ్లకు ఆపరేషన్ జరగడంతో ప్రస్తుతం మితారాణి నడవలేని పరిస్థితిలో ఉంది. నిర్లక్ష్యంతో వ్యవహరించి మితారాణిని నడవకుండా చేసిన డాక్టర్లపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె బంధువులు డిమాండ్ చేస్తున్నారు.