కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పారు గుర్తుంది కదా. పంది కడుపున మనిషి పుడతాడు అని. అవును, అదే..! అయితే అదే మాట నిజమైంది..! అంటూ ఈ మధ్య కాలంలో, గత వారం రోజులుగా ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో ఓ వార్త విపరీతంగా వైరల్ అవుతోంది గమనించారు కదా. అలా అని చెప్పి ఆ వార్తతోపాటు మనకు పలు ఫొటోలు కూడా కనిపిస్తున్నాయి. వాటిని చూసి చాలా మంది నిజమే అని నమ్మి ఆ ఫొటోలను బాగా షేర్ చేయడం మొదలు పెట్టారు. అయితే.. నిజానికి ఆ ఫొటోల్లో ఉన్నది అసలైన జీవాలు కావు. అవి కళాఖండాలు. అవును, మీరు విన్నది నిజమే. ఓ విదేశీ కళాకారిణి వాటిని తీర్చిదిద్దింది.
మగానుకో లైరా అనే ఓ కళాకారిణికి సిలికాన్‌తో కళాఖండాలను చేయడం అలవాటు. అలా చేసే ఆకృతులను ఆమె తన వెబ్‌సైట్‌లో విక్రయిస్తుంటుంది. అందులో భాగంగానే చిత్రంలో ఉన్న బొమ్మలను ఆమె తీర్చిదిద్దింది. వాటినే ఫొటోలు తీసి తన వెబ్‌సైట్‌లో పెట్టింది. ఆ కళాఖండాల ఖరీదు మన కరెన్సీలో రూ.80 వేలు. అయితే కొందరు ఆ ఫొటోలను నిజమైనవిగా పేర్కొంటూ వైరల్ చేయడం మొదలు పెట్టారు. దీంతో చాలా తక్కువ సమయంలోనే అవి వైరల్ అయ్యాయి.
ఆ ఫొటోలో ఉన్న పంది కడుపున మనిషి పుట్టాడు.. బ్రహ్మం గారు చెప్పిన కాలజ్ఞానం నిజమైంది.. అంటూ కొందరు ఆ ఫొటోలను ఫేస్‌బుక్, వాట్సాప్‌లలో వైరల్ చేశారు. మరీ ముఖ్యంగా ఆ ఫొటోలు మన రెండు తెలుగు రాష్ర్టాల్లో విపరీతంగా వైరల్ అయ్యాయి. అయితే చివరకు ఆమె ఆ విషయం తెలియడంతో ఆ ఫొటోలపై వివరణ ఇచ్చింది. కాబట్టి చూశారుగా.. సోషల్ మీడియా ఎంత పనిచేసిందో. అందులో వచ్చే ఇలాంటి నకిలీ వార్తలను నమ్మకండి. లేదంటే మోసపోవాల్సి వస్తుంది..!