రెండున్నర కిలోల చికెన్ ధర కోటీ నలభై ఆరు లక్షలు..!

-

షాక్ అయ్యారా? ఆశ్చర్యపోయారా? నాన్ వెజ్ ప్రియులకైతే గుండె ఆగిపోయి ఉంటుంది. కోటీ నలభై ఆరు లక్షలు అంటే.. ఇక మనం జన్మలో చికెన్ ముక్కను తినలేమా? అని తెగ బాధ పడిపోకండి. ఎందుకంటే.. కోటీ నలభై ఆరు లక్షలు కరెక్టే కాని.. అవి రూపాయలు కావు వెనిజులా కరెన్సీ బాలివర్లు. అక్కడ రెండున్నర కిలోల చికెన్ కొనాలంటే అక్షరాలా కోటీ 46 లక్షల బాలివర్లు చెల్లించాల్సిందే.

వెనిజులా గత కొన్ని రోజులుగా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. దీంతో వెనిజులాలో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోయింది. అధికారిక కరెన్సీ బాలివర్ విలువ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మార్కెట్ లో ఏ సరుకులు కొనాలన్నా సంచుల నిండా డబ్బులు తీసుకెళ్తే కాని వచ్చే పరిస్థితి లేదు.

వెనిజులాలోని కారకాస్ లో ఉన్న ఓ చికెన్ షాపులో ఇలా రెండున్నర కిలోల చికెన్ కొనాలంటే ఇంత డబ్బు చెల్లించాలని బోర్డు పెట్టారు. దీంతో దానికి సంబంధించిన బోర్డు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే కోటీ 46 లక్షల బాలివర్లు చెల్లించినా అది కేవలం 2.22 డాలర్లు మాత్రమే. మన కరెన్సీలో అయితే 155 రూపాయలు అంతే. ఇక ఈ కరెన్సీని సంచుల్లో మోసుకెళ్లలేక కొంతమంది చెత్తడబ్బాలోనూ పడేస్తున్నారట. వాహ్వా.. కరెన్సీని చెత్త డబ్బలో చూస్తుంటే థ్రిల్లింగ్ గా ఉంది కదా.

ఇక.. వెనిజులాలో ఆర్థిక సంక్షోభం ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దేశంలో చమురు నిల్వలు అధికంగా ఉండటంతో ప్రభుత్వమే చమురును ఎగుమతి చేస్తుండేది. అయితే.. ఇటీవల చమురు ధరలు అమాంతం పడిపోవడంతో దేశంలో సంక్షోభం వచ్చింది. ఇదివరకు ప్రభుత్వం చమురు ఉత్పత్తుల మీదే ఆధారపడి మిగితా రంగాలను నిర్లక్ష్యం చేయడమే ఆర్థిక సంక్షోభానికి కారణం అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దాంతో పాటు ఇష్టమున్నట్టుగా ప్రజలు ఉద్యోగాలు ఇచ్చి జీతాలను ఒక్కసారిగా పెంచడం… కరెన్సీ ప్రింటింగ్ ను ఇష్టమొచ్చినట్టు ముద్రించడం లాంటి వాటివి కూడా ఈ సంక్షోభానికి కారణాలంటున్నారు. ఇక.. ఇటువంటి పరిస్థితుల్లో దేశంలో ఉండలేక చాలామంది వేరే దేశాలకు వలస వెళ్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version