ఆ బీచ్ లో ఫోటోలు తీసుకున్నారంటే.. అంతే.. మీకు ఉరి శిక్షే..!

-

బీచ్ కు వచ్చిన టూరిస్టులు రకరకాల పోజులతో అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే.. అది పైలట్ల ఏకాగ్రతను దెబ్బతీస్తుందని థాయ్ అధికారులు భావించారు.

ఏదైనా బీచ్ కు వెళ్లినప్పుడు అక్కడ ఎంజాయ్ చేసిన తాలూకా జ్ఞాపకాలను పదిలపరచుకోవడం కోసం ఫోటోలు, వీడియోలు తీసుకుంటారు. వాటిని అప్పుడప్పుడు చూసుకుంటూ మురిసిపోతుంటారు. కానీ.. మీరు ఒక బీచ్ కు వెళ్లారంటే అక్కడ ఫోటోలు కానీ.. వీడియోలు కానీ తీయకూడదు. తీశారంటే అంతే మీకు ఉరి శిక్ష పడటం ఖాయం. నమ్మశక్యంగా లేదా? ఫోటోలు తీస్తే ఉరి శిక్ష వేస్తారా ఎక్కడైనా? మేము ఏమన్నా చెవిలో పూలు పెట్టుకున్నామా? అంటూ ఆవేశపడకండి. ఓసారి థాయిలాండ్ వెళ్లొద్దాం పదండి..

థాయిలాండ్ లోని ఫుకెట్ లో ఉన్న మాయ్ ఖావ్ బీచ్ గురించే మనం మాట్లాడుకునేది. ఆ బీచ్ కు ఓ ప్రత్యేకత ఉంది. ఆ బీచ్ ఫుకెట్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పక్కనే ఉంటుంది. దీంతో ఆ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యే విమానాలు ఆ బీచ్ నుంచే వెళ్తాయి. అవి చాలా తక్కువ ఎత్తునుంచి వెళ్తుండటంతో బీచ్ కు వచ్చే వాళ్లు విమానాలు అక్కడి నుంచి వెళ్లేటప్పుడు ఫోటోలు, వీడియోలు తీసుకోవడం ప్రారంభించారు.

అయితే.. విమానాలు లాండ్ అయ్యే సమయంలో అక్కడ డ్రోన్లను ఎగరేసినా, షైనింగ్ లైట్లు వేసినా, లేజర్ లైట్లు వేసినా, ఫోటోలు, వీడియోలు తీసినా అవి విమానం ల్యాండింగ్ సమస్యలను సృష్టిస్తాయట.

అంతే కాదు.. బీచ్ కు వచ్చిన టూరిస్టులు రకరకాల పోజులతో అక్కడ ఫోటోలు తీసుకుంటుంటే.. అది పైలట్ల ఏకాగ్రతను దెబ్బతీస్తుందని థాయ్ అధికారులు భావించారు. పైలట్ల దృష్టి మరలి లేనిపోని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గ్రహించిన అధికారులు.. దాని చుట్టూ ఎక్స్ క్లూజివ్ జోన్ ను పెట్టారు. ఎయిర్ పోర్టు చుట్టూ దాదాపు 9 కిలోమీటర్ల మేర ఎక్స్ క్లూజివ్ జోన్ ను ప్రకటించడంతో.. ఆ ప్రాంతంలో ఫోటోలు, వీడియోలు తీస్తే జైల్లో వేస్తారట. ఎవరైనా ఆ నిబంధనను అతిక్రమిస్తే ఉరి శిక్ష కూడా వేస్తారట. ఎయిర్ నావిగేషన్ చట్టం చాలా కఠినంగా ఉంటుందట. అది సంగతి. అందుకే మీరెవరైనా అక్కడికి వెళ్తే ఫోటోలు, వీడియోలు మాత్రం తీసుకోకండి.

 

 

Read more RELATED
Recommended to you

Exit mobile version