ఇవ్వాళ రేపు సిటీల్లో ఎక్కువగా ఆన్ లైన్ ఫుడ్ మీదనే ఆధారపడుతున్నారు చాలామంది. వంట వండే సమయం లేని వాళ్లు, చేతగాని వాళ్లు, ఇలా చాలామంది ఒక్క క్లిక్ తో స్మార్ట్ ఫోన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారు. ఫుడ్ ఆర్డర్ అయితే చేస్తున్నారు కానీ… ఆ ఫుడ్ ను ఎలా వండుతున్నారు. దాంట్లో ఏం ఉపయోగిస్తున్నారు. హైజీనిటీ ఎంత. అనేవి చెక్ చేస్తున్నారా? లేదు.. యాప్ లో వంటకాల ఫోటోలు చూసి బుక్ చేస్తున్నారు తప్పితే ఫుడ్డు నాణ్యతను చూడట్లేదు చాలామంది. దానికి ఉదాహరణగా మనం ఎన్నో ఘటనలు చూశాం.
తాజాగా ఇటువంటి ఘటనే ఒకటి జరిగింది. జొమాటో ఫుడ్ డెలివరీ యాప్ లో పన్నీర్ డిష్ ను ఓ కస్టమర్ బుక్ చేస్తే.. పన్నీర్ లో ప్లాస్టిక్ ఫైబర్ వచ్చింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్ కు చెందిన సచిన్ జమ్ దారె అనే వ్యక్తి పన్నీర్ చిల్లీ, పన్నీర్ మసాలాను జొమాటో యాప్ లో బుక్ చేశాడు. ఆర్డర్ వచ్చాక.. దాన్ని తన పిల్లలకు ఇచ్చాడు. వాళ్లు తింటుంటే.. పన్నీర్ గట్టిగా ఉండి.. పళ్లకు అంటుకుంటోంది. దీంతో దాన్ని గమనించిన సచిన్.. అందులో ప్లాస్టిక్ కలిసినట్టు గమనించి.. ఫుడ్ ఆర్డర్ చేసిన రెస్టారెంట్ కు వెళ్లి రెస్టారెంట్ సిబ్బందిని నిలదీశాడు. కానీ.. వాళ్లు సచిన్ ఫిర్యాదును పట్టించుకోలేదు. దీంతో నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఈ ఘటనపై ఫిర్యాదు చేశాడు. దీంతో వాళ్లు ఫిర్యాదు తీసుకొని.. ఫుడ్ ను టెస్ట్ కోసం ల్యాబ్ కు పంపించారు. ఫలితాలు వచ్చాక రెస్టారెంట్ పై చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
అయితే.. ఈ విషయం తెలుసుకున్న జొమాటో… కస్టమర్ కు క్షమాపణలు చెప్పి… తమ లిస్ట్ నుంచి ఆ రెస్టారెంట్ ను తొలగించినట్టు పేర్కొన్నది. జొమాటో ఎప్పుడూ ఆహార భద్రత, నాణ్యత, పరిశుభ్రతకు కట్టుబడి ఉంటుందని స్టేట్ మెంట్ రిలీజ్ చేసింది. కస్టమర్ ఆర్డర్ చేసిన డబ్బును కూడా రిఫండ్ చేసింది.