నేటి నుంచి ప్రారంభం అయిన బ‌తుక‌మ్మ సంభ‌రాలు..

-

బతుకమ్మ పండుగ తెలంగాణా రాష్ట్రములోని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ గొప్ప వేడుక. అచ్చంగా జానపదుల పండుగ. ప్రకృతితో పెనవేసుకుని సంస్కృతిని అందంగా ప్రతిబింబించే అపురూప దృశ్యం. రంగురంగుల పూలను తెలంగాణ ఆడపడుచులు పేర్చే అందమైన పండుగ‌. తెలంగాణ ఆడబిడ్డలు కోటి ఆశలతో ఎదురు చూసే బతుకమ్మ పండుగ రానే వచ్చింది. ఈ బతుకమ్మ(గౌరి) పండుగ లేదా సద్దుల పండుగ దసరాకి రెండు రోజుల ముందు వస్తుంది.

సెప్టెంబరు, అక్టోబరు నెలలు తెలంగాణ, ఆంధ్రా ప్రజలకు పండుగల నెలలు. ఈ నెలలలో రెండు పెద్ద పండుగలు జరపబడతాయి. ఈ పండుగలలో ఒకటి బతుకమ్మ పండుగ, మరియొకటి దసరా. అయితే బతుకమ్మ పండుగ మాత్రం, తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ.. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక పండుగ. తొమ్మిది రోజుల పాటు వివిధ పేర్లతో బతుకమ్మను పూజిస్తారు. రంగు రంగుల పూలతో త్రికోణాకారంలో పేర్చి అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ వలయంగా తిరుగుతూ పాడే బతుకమ్మ పాటలు పాడతారు. బొడ్డెమ్మతో మొదలు ఎంగిలిపుప్వు బతుకమ్మ, సద్దుల బతుకమ్మ.. ఇలా దేని ప్రత్యేకత దానిదే.. తొమ్మిది రోజుల పాటు కొనసాగే బతుకమ్మలను బావిలో లేదా నీటి ప్రవాహంలో నిమజ్జనం చేస్తారు.

ఈ పండుగ వర్షాకాలపు చివరిలో, శీతాకాలపు తొలి రోజులలో వస్తుంది. అప్పటికే వర్షాలతో చెరువులన్నీ మంచి నీటితో నిండి ఉంటాయి. రకరకాల పువ్వులు రంగు రంగులలో ఆరుబయలలో పూసి ఉంటాయి. వాస్త‌వానికి తెలంగాణ ఉద్యమంలో బతుకమ్మ పాత్ర ఎంతో విశిష్టమైంది. ఉద్యమ సందర్భాల్లో బతుకమ్మతో ఊరేగింపులు చేసిన తెలంగాణ ప్రజలు తమ తమ అస్తిత్వాన్ని సగర్వంగా ప్రకటించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరుణంలో బతుకమ్మ పండుగకు ప్రాధాన్యత మరింతగా పెరిగిపోయింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version