తెలంగాణ సంస్కృతికి నిలువెత్తు రూపం బతుకమ్మ.. తెలంగాణ మహిళల ఆత్మగౌరవానికి చిహ్నం బ తుకమ్మ.. ప్రకృతికి, మనిషికి గల మధ్య సంబంధానికి ప్రతీక బతుకమ్మ.. తెలంగాణలో బతుకమ్మకు, ద సరాకు ఉన్న ప్రాధాన్యం మరే పండగకూ ఉండదు. సాధారణంగా పూలతో దేవుడిని పూజించడం సంప్రదాయం… కానీ, పూలనే దేవుడిగా పూజించడం ఈ పండుగ ప్రత్యేకం. చిన్నాపెద్దా, పేద, ధనిక, పల్లె, పట్నం అనే భేదంలేకుండా ప్రతీ ఒక్కరూ అంత్యంత వైభవంగా జరుపుకునే పండుగ బతుకమ్మ..
ఆశ్వయుజ మాసం శుద్ధ పాఢ్యమి నుంచి తొమ్మిది రోజులపాటు బతుకమ్మను వేడుకగా జరుపుకుంటారు. రంగురంగుల పూలను త్రికోణాకృతిలో పేర్చి, అలంకరించిన బతుకమ్మల చుట్టూ చప్పట్లు చరుస్తూ , వలయంగా తిరుగుతూ మహిళలు పాడే పాటలు మనసుకు హత్తకుంటాయి. తొలిరోజు బతుకమ్మను ఎంగిలపూల బతుకమ్మ అని, చివరి రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అని అంటారు. వీటిలో దేని ప్రత్యేకత దానిదే… ఇలా తొమ్మిది రోజులు ఆడిన బతుకమ్మను నీటిలో నిమజ్జనం చేస్తారు.
ఈ తొమ్మిది రోజులు వేటికదే ప్రత్యేకం. తొలిరోజు బతుకమ్మను ఎంగిలపూలు అంటారు.
1.నవరాత్రుల్లో మొదటిదైన ఎంగిలపూల రోజున వాయనంగా తమలపాకులు , తులసి ఆకులు ఇచ్చిపుచ్చుకుంటారు. నువ్వులను దంచి పొడిచేసి నేవేద్యంగా సమర్పిస్తారు.
2. అటుకల బతుకమ్మ:నవరాత్రుల్లో రెండోరోజు అటుకుల బతుకమ్మ అంటారు. ఈ రోజును మహిళలు ఒకరికొకరు అటుకులను వాయనంగా ఇచ్చిపుచ్చుకుంటారు.
3. ముద్దపప్పు బతుకమ్మ: మఊడో రోజు బతుకమ్మను ముద్దపప్పు బతుకమ్మ అంటారు. వాయనంగా సత్తుపిండి, పెసర్లు, చెక్కర, బెల్లం కలిపి పెడతారు.
4. నానబియ్యం బతుకమ్మ: నాలుగవ రోజు నానబియ్యం అంటారు. ఈ రోజు చెరువు వద్ద నానబియ్యంను ఫలహారంగా పెడుతారు.
5. అట్ల బతుకమ్మ: ఐదోరోజు వాయినంగా పిండితో చేసిన అట్లను పెడతారు.
6. అలిగిన బతుకమ్మ: ఆరో రోజు బతుకమ్మను అలిగిన బతుకమ్మ అంటారు.
7. వేపకాయల బతుకమ్మ: ఏడో రోజు బతుకమ్మను వేపకాయల బతుకమ్మ అంటారు. ఈరోజు వాయనంగా సకినాల పిండిని, వేప కాయల్లా చేసి పెడతారు. లేదా పప్పుబెల్లం నైవేద్యంగా పెడతారు.
8. వెన్నముద్దల బతుకమ్మ: ఎనిమిదో రోజు బతుకమ్మను వెన్నముద్ద బతుకమ్మ అంటారు. ఈరోజు నువ్వులు, బెల్లం కలిపి నైవేద్యం గా పెడతారు.
9. తొమ్మిదో రోజు బతుకమ్మను సద్దుల బతుకమ్మ అంటారు. ఇదే చివర పండగ రోజు. ఈరోజు సద్ద పిండి, బెల్లంను కలిపి ముద్దలుగా తయారుచేస్తారు. గౌరమ్మ వద్ద నైవేద్యంగా ఉంచి పూజలు చేస్తారు.