జైశ్రీరామ్…. శ్రీరామ జయ రామ.. జయజయ రామ అనే నామస్మరణంతో మిథిలా ప్రాంగణంతో పాటు భద్రాచలం పురవీధులన్నీ మార్మోగిపోయాయి. భద్రాద్రి పట్టణమంతా ఆధ్యాత్మకశోభ అల్లుకుంది. మిథిలా ప్రాంగణంలో అభిజిత్ ముహూర్తాన శ్రీసీతారాముల కల్యాణ మహోత్సవం రంగరంగ వైభవంగా జరిగింది. ముందుగా.. భక్తుల కోలాహలం, మంగళవాద్యాలు, కోలాట నృత్యాల నడుమ ఉత్సవమూర్తులను ఊరేగింపుగా మిథిలా ప్రాంగణానికి తీసుకువచ్చారు.
అనంతరం కల్యాణ పీఠంపై ఉత్సవమూర్తులను ఉంచి రామయ్య గుణగణాలు, సీతమ్మ అణకువ, అంద చందాలను అర్చకులు భక్తులకు వర్ణించారు. అభిజిత్ ముహూర్తాన అర్చకులు సీతారాముల శిరస్సులపై జీలకర్ర బెల్లం ఉంచిన అనంతరం రామయ్య సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ చేశారు. సీతారాముల కల్యాణానికి ప్రభుత్వం తరఫున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు.
స్వామివారికి పచ్చల పతకం, సీతమ్మకు చింతాకు పతకం, లక్ష్మణస్వామికి రామమాడలు అలంకరించి మదుపర్కం సమర్పించారు. మంగళధారణ సమయంలో శ్రీరామ జయరామ జయజయ రామ అంటూ భక్తులు ఉచ్ఛస్తుంటే మిథిలా ప్రాంగణమంతా ఆధ్యాత్మికశోభ విలసిల్లింది. రామయ్య కల్యాణాన్ని వీక్షించేందుకు హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు వచ్చారు.