ఆరోగ్య శ్రీ కింద ప్రస్తుతం ఉన్న ప్రొసీజర్లను మరిన్ని పెంచాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఆరోగ్య శ్రీ పరిధిలోకి కొత్తగా 754 ప్రొసీజర్లు అమల్లోకి తీసుకురావాలని అధికారులను మఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. సెప్టెంబర్ 5 నుంచి కొత్త విధానాలు అందుబాటులోకి రానుండగా.. ఈ పథకం కింద చికిత్స అందుతోన్న విధానాల సంఖ్య 3118కి చేరనుంది. వైద్య ఆరోగ్య శాఖపై జరిగిన సమీక్షలో మరికొన్ని కీలక సంస్కరణలకు సీఎం పచ్చజెండా ఊపారు.
ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌పై సీఎం సమీక్షించారు. దీనిని సమర్థవంతంగా అమలు చేయాలని.. అందుకోసం మూడు అంశాలపై దృష్టి సారించాలని అధికారులకు సూచించారు. విలేజ్ క్లినిక్, పీహెచ్‌సీల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని.. అనంతరం పూర్తిస్థాయిలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు.
అవసరమైన అంబులెన్స్‌లను సిద్ధం చేయాలని.. దీనికోసం ప్రత్యేక అధికారిని నియమించుకుని.. పనులు ఎలా ముందుకు సాగుతున్నాయనే దానిపై రోజూ సమీక్షించాలని సీఎం ఆదేశించారు. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్‌కు అవసరమైన కసరత్తు పూర్తి చేస్తున్నట్లు ముఖ్యమంత్రికి అధికారులు తెలిపారు. పీహెచ్‌సీలు–మొబైల్ మెడికల్ యూనిట్ల మ్యాపింగ్ పూర్తైందని.. పీహెచ్‌సీలు – సచివాలయాలు మ్యాపింగ్ పూర్తి చేస్తామని తెలిపారు. ఇప్పటికే 656 ఎంఎంయూ104లు పని చేస్తున్నాయని.. మరో 432 వాహనాలను సమకూరుస్తున్నామని పేర్కొన్నారు.