మన తెలుగు వారికి కారం లేకుండా భోజనం పూర్తి కాదు. గుమగుమలాడే ఘాటైన వంటకాలు లాగించేసిన తర్వాత నోరు కడుపు మంటతో అల్లాడిపోవడం సహజం. ఈ వేడిని త్వరగా తగ్గించుకోవడానికి చాలా మంది వెంటనే నీళ్లు తాగేస్తారు. కానీ నీళ్లు తాగడం వల్ల ఉపశమనం దొరకదు సరికదా, మంట మరింత ఎక్కువ అవుతుంది! ఈ మంటను పూర్తిగా తగ్గించి, కడుపును కూల్ చేసే పానీయం ఒకటుంది. నిజానికి ఆ మ్యాజిక్ డ్రింక్ మన ఇంట్లో ఎప్పుడూ ఉండేదే. మరి ఆ స్పైసీ బర్న్‌ను సమర్థవంతంగా తగ్గించే బెస్ట్ పానీయం ఏంటో దాని వెనుక ఉన్న రహస్యం ఏంటో తెలుసుకుందాం..
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపు మరియు నోటి మంటను తగ్గించడానికి అత్యంత ప్రభావవంతమైన పానీయం ఏదైనా ఉందంటే, అది పాలు (Milk) లేదా పాల ఉత్పత్తులైన పెరుగు (Curd) లేదా మజ్జిగ. దీనికి ఒక బలమైన శాస్త్రీయ కారణం ఉంది. కారానికి కారణమయ్యే రసాయనం పేరు క్యాప్సైసిన్. ఈ క్యాప్సైసిన్ అనేది ఒక రకమైన ఆయిల్ లాంటి పదార్థం ఇది నీటిలో కరగదు. అందుకే, మీరు ఎంత నీరు తాగినా ఆయిల్ లాంటి క్యాప్సైసిన్ కరగదు కాబట్టి మంట తగ్గదు, పైగా అది నీటితో కలిసి మరింత ప్రాంతానికి వ్యాపించి మంటను పెంచుతుంది.

పాల ఉత్పత్తులలో అధికంగా కొవ్వు మరియు కేసిన్ అనే ప్రొటీన్ ఉంటాయి. ఈ కేసిన్ ప్రొటీన్ ఒక ‘డిటర్జెంట్’ లాగా పనిచేస్తుంది. ఇది క్యాప్సైసిన్ నూనె అణువులను బంధించి, కరిగించి, వాటిని నోటిలోని రిసెప్టర్ల నుంచి దూరం చేస్తుంది. ముఖ్యంగా పూర్తి కొవ్వు ఉన్న పాలు లేదా పెరుగు, మజ్జిగ, క్యాప్సైసిన్‌ను వేగంగా కరిగించి ఉపశమనాన్ని ఇస్తాయి. అందుకే కారం ఎక్కువైనప్పుడు చల్లని నీరు లేదా శీతల పానీయాలకు బదులుగా వెంటనే పాలు తాగడం, లేదా పెరుగు, మజ్జిగ, లస్సీ వంటివి తీసుకోవడం ఉత్తమం. ఇవి మంటను త్వరగా అణచివేసి, కడుపుకు చల్లదనాన్ని ఇస్తాయి.
గమనిక: పాలు లేదా పెరుగు అందుబాటులో లేకపోతే, అదనపు ఉపశమనం కోసం పంచదార లేదా తేనె కలిపిన ఏదైనా ఆహారాన్ని (ఉదాహరణకు, అరటిపండు లేదా కొంచెం అన్నం) నెమ్మదిగా తినడం వల్ల కూడా కొంత మేర మంట తగ్గుతుంది.
