పండ్లు, సలాడ్లు, పానీ పూరీ ఇలా దేని పైనైనా కొద్దిగా చాట్ మసాలా చల్లితే చాలు, ఆ రుచే వేరు. ఆ పుల్లపుల్లని, కారంకారం రుచికి చాలా మంది బానిసలవుతారు. కానీ మీరు రోజువారీ ఆహారంలో ఈ మసాలాని విపరీతంగా వాడుతున్నారా? అయితే జాగ్రత్త ఈ రుచి మరుగున దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు మీ ఆరోగ్యాన్ని నెమ్మదిగా దెబ్బతీయొచ్చు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
అధిక సోడియం, గుండెకు ప్రమాదం: చాట్ మసాలాను తయారు చేసేటప్పుడు రుచి కోసం ఉప్పు (సాధారణ ఉప్పు మరియు నల్ల ఉప్పు) అధికంగా కలుపుతారు. అందుకే ఇది అంత రుచికరంగా అనిపిస్తుంది. అయితే రోజూ అధిక మొత్తంలో సోడియం (ఉప్పులో ఉండేది) శరీరంలోకి చేరడం వల్ల రక్తపోటు పెరుగుతుంది. అధిక రక్తపోటు గుండె, మూత్రపిండాలు మరియు ధమనులపై తీవ్ర ఒత్తిడిని పెంచుతుంది. ఇది దీర్ఘకాలంలో గుండె జబ్బులకు దారితీస్తుంది. ముఖ్యంగా కిడ్నీ సమస్యలు లేదా రక్తపోటు ఉన్నవారు చాట్ మసాలాను నియంత్రించడం తప్పనిసరి.

జీర్ణ సమస్యలు, అసిడిటీకి దారి: చాట్ మసాలాలో ఉన్న పులుపు (ఆమ్చూర్ – మామిడి పొడి) మరియు ఇతర మసాలా దినుసులు కొన్నిసార్లు జీర్ణవ్యవస్థను ఇబ్బంది పెడతాయి. ఎక్కువ మోతాదులో తీసుకున్నప్పుడు, ఈ మసాలాలు కడుపులో యాసిడ్ ఉత్పత్తిని పెంచి, అసిడిటీ, ఛాతీలో మంట మరియు అజీర్ణ సమస్యలకు దారితీయవచ్చు. చాట్ మసాలాలో ఆరోగ్యకరమైన మసాలాలు ఉన్నప్పటికీ, దానిని విపరీతంగా వాడినప్పుడు కలిగే ప్రతికూల ఫలితం ప్రధానంగా ఉప్పు మరియు యాసిడ్ స్థాయిల వల్ల ఏర్పడుతుంది.
చాట్ మసాలా ఆరోగ్యానికి పూర్తిగా చెడు అని చెప్పలేం, ఎందుకంటే ఇది జీర్ణక్రియకు తోడ్పడే జీలకర్ర కొత్తిమీర వంటి పదార్థాలను కలిగి ఉంటుంది. కానీ అధిక ఉప్పు కారణంగా దీన్ని అతిగా వాడటం ప్రమాదకరం. మీ రుచి మొగ్గలను సంతృప్తి పరుచుకునేందుకు, చాట్ మసాలాని మితంగా అప్పుడప్పుడు మాత్రమే వాడండి.
గమనిక: మీరు హైపర్‌టెన్షన్ (అధిక రక్తపోటు) లేదా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే ఉప్పు అధికంగా ఉండే చాట్ మసాలా వినియోగాన్ని పూర్తిగా నివారించడం లేదా వైద్యుని సలహా మేరకు పరిమితం చేయడం శ్రేయస్కరం.
