పిల్లలు నిద్రలో మాట్లాడటం కామనేనా..? కారణం ఇంకేదైనా ఉందా..?

-

పెద్దలు నిద్రలో మాట్లాడటం, గురకపెట్టడం కామన్. ఇది ఏదో ఒత్తిడి వల్ల, కొన్నిసార్లు అనారోగ్య సమస్య వల్ల జరుగుతుంది. కానీ చిన్నపిల్లలు కూడా నిద్రలో మాట్లాడుతున్నారంటే.. వారికి ఏదైనా సమస్యా..? అలవాటా..? అసలు పిల్లలు ఇలా ఎందుకు మాట్లాడాతారు.? మానసికంగా ఏ విషయంలో అయినా బాధపడుతున్నారా..? ఈరోజు మనం చిన్నపిల్లలు నిద్రలో మాట్లాడటానికి ఏంటి కారణాలు, సమస్యకు పరిష్కార మార్గాలు చూద్దాం..!

పిల్లలు నిద్రలో మాట్లాడటానికి అనేక కారణాలు ఉంటాయి. కొన్నిసార్లు పిల్లలు కలత చెందినప్పుడు ఇలా చేస్తుంటారు. భయంతో జ్వరం తెచ్చుకున్నప్పుడు లేదా సెలవులకు విహారయాత్రకు వెళ్లడానికి సంతోషంగా ఉన్నప్పుడు కూడా నిద్రలో మాట్లాడతారట. కొన్నిసార్లు పిల్లల నిద్ర చక్రం చెదిరినప్పుడు, నిద్రలో మాట్లాడవచ్చు. అలాగే కుటుంబంలో ఎవరికైనా ఈ అలవాటు ఉన్నప్పుడు వంశపారంపర్యంగా వారి పిల్లలకు కూడా ఈ అలవాటు వస్తుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.

పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందా?

పిల్లల ప్రతి అలవాటును తల్లిదండ్రులు గమనిస్తారు. కొన్నిసార్లు కొన్ని అలవాట్లు వారి ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతాయి. అయితే నిద్రలో మాట్లాడే అలవాటు వారి ఆరోగ్యంపై ప్రభావం చూపదని నివేదికలు చెప్తున్నాయి. 3 నుంచి 12 ఏళ్ల పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. కొంతమంది పిల్లలు నిద్రలో మాట్లాడతారు, కొందరు నవ్వుతారు, మరికొందరు కోపంగా ఉంటారు. ఇలా నిద్రలో మాట్లాడే అలవాటు ఆడపిల్లల కంటే మగపిల్లల్లోనే ఎక్కువ ఉంటుందట. అయితే వారు పెరిగే కొద్దీ సమస్య దానంతటదే పోతుందని స్పష్టం చేస్తున్నారు.

ఏం చేస్తే సమస్య నయం అవుతుంది..?

పిల్లలు చిన్నతనంలో నిద్రలో మాట్లాడటం సహజమే. మీకు కంగారుపడాల్సిన పనిలేదు. అయితే తల్లిదండ్రులు కొన్ని విషయాలపై శ్రద్ధ పెట్టడం మంచిది. ముఖ్యంగా మీ పిల్లల నిద్రపై దృష్టి పెట్టండి. వేళకు నిద్రపోవడం అలవాటు చేయించండి. వారు కనీసం 8 నుండి 9 గంటలు నిద్రపోయేలా జాగ్రత్తలు తీసుకోండి. నిద్రపోయే ముందు మొబైల్ చూడటం, వీడియో గేమ్స్‌ ఆడకుండా చూడండి, అలాగే హారర్ సన్నివేశాలు చూపించకండి, రాత్రివేళ తీపి పదార్థాలు తినిపించవద్దు. పిల్లల దినచర్యలో కొన్ని వ్యాయామాలను చేర్చండి. పిల్లలు తరచుగా కోపంతో ఏదైనా మాట్లాడుతుంటే, మరుసటి రోజు ఉదయాన్నే మీరు ఆ విషయం గురించి వారిని అడిగి సమస్యను తెలుసుకోండి. ఇలా చేస్తే పిల్లలు నిద్రలో మాట్లాడటం మానేసి ప్రశాంతంగా నిద్రపోతారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version