ఆ రెండింటి వల్లే క్యాన్సర్ మరణాలు : ది లాన్సెట్

-

క్యాన్సర్ మహమ్మారి.. ఒకప్పుడు పెద్దవాళ్లలోనే వచ్చే ఈ వ్యాధి ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వస్తోంది. క్యాన్సర్ బారిన పడి ఓవైపు బాల్యాన్ని కోల్పోయిన వారు కొందరైతే.. మరోవైపు ప్రాణాలనే కోల్పోయినవారు మరికొందరు. ప్రపంచ దేశాలను ఈ క్యాన్సర్ భూతం వెంటాడుతూనే ఉంది. దీనికి ఎన్ని మందులు కనిపెట్టినా.. ఎందరు పరిశోధనలు చేసినా.. ఆ మందులతో కాస్తసేపు ఊరట లభిస్తోంది కానీ కొద్దిరోజుల తర్వాత మళ్లీ వ్యాధి తిరగబడుతోంది. ఊపిరి తీసుకెళ్తోంది. ఏటా లక్షల సంఖ్యలో క్యాన్సర్ బాధితులు చనిపోతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

లక్షల మంది ప్రాణాలను బలి తీసుకుంటున్న ఈ క్యాన్సర్ మహమ్మారి సోకడానికి గల కారణాలపై పలువురు అధ్యయనాలు చేశారు. ధూమపానం, మద్యం సేవించడం, అధికబరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్‌ మరణానికి ప్రధాన ముప్పుగా మారినట్లు తాజాగా ఓ అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు సగం ఈ కారణాల వల్లే చోటుచేసుకుంటున్నాయని పేర్కొంది. ప్రపంచంపై వ్యాధులు, గాయాలు, ప్రమాద కారకాల భారం-2019 ఫలితాలపై నిర్వహించిన అధ్యయనం నివేదికను ‘ది లాన్సెట్‌’ జర్నల్‌ ప్రచురించింది.

క్యాన్సర్‌ బాధితుల్లో మరణాలకు దారితీస్తున్న ప్రధాన కారణాలను విశ్లేషించేందుకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్‌ వాషింగ్టన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌కు చెందిన పరిశోధకులు అధ్యయనం చేపట్టారు. ఈ సందర్భంగా ధూమపానం, మద్యం సేవించడం, అధిక బరువు కలిగి ఉండడం వంటివి క్యాన్సర్‌ మరణాలకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయని గుర్తించారు. వీటివల్లే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 44.5లక్షల మంది బాధితులు ప్రాణాలు కోల్పోతున్నారని పేర్కొన్నారు. అంటే అన్ని దేశాల్లో చోటుచేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో దాదాపు 44.4శాతం ఈ మూడు కారణాల వల్లే చనిపోతున్నారని వెల్లడించారు.

‘2019లో దాదాపు 28.8లక్షల మంది క్యాన్సర్‌ సోకిన పురుషులు ఈ ప్రమాదకరమైన అలవాట్ల వల్లే ప్రాణాలు కోల్పోయారు. మహిళా బాధితులతో పోలిస్తే ఇవి దాదాపు మూడింతలు ఎక్కువ. ప్రధానంగా శ్వాసకోస క్యాన్సర్‌ బాధితుల్లోనే ఈ మరణాలు అధికంగా ఉన్నాయి. పురుషులు, మహిళలు ఇద్దరిలోనూ మరణాలకు ప్రధాన కారణం ధూమపానమే. దాదాపు 36.9శాతం బాధితులు ఈ ఒక్క ప్రమాదపు అలవాటు వల్లే చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో పరిశోధకులతోపాటు విధానకర్తలకు ఈ అధ్యయనం ఎంతగానో దోహదపడుతుంది’ అని అధ్యయనంలో కీలకంగా వ్యవహరించిన డాక్టర్‌ క్రిస్టోఫర్‌ ముర్రే పేర్కొన్నారు.

మరోవైపు మహిళల్లో ప్రధానంగా సర్వైకల్‌ (17.9శాతం), పేగు (15.8శాతం), రొమ్ము (11శాతం) క్యాన్సర్‌లు అధికంగా సంభవిస్తున్నట్లు తాజా అధ్యయనం పేర్కొంది. పురుషుల్లో మాత్రం ఎక్కువగా పేగు, అన్నవాహిక, జీర్ణాశయ క్యాన్సర్లు వెలుగు చూస్తున్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version