చిన్నపిల్లలకు రోగనిరోధక శక్తి చాలా తక్కువగా ఉంటుంది. దాని వలన జలుబు, దగ్గు, జ్వరం వంటి మొదలైన సమస్యలు తరచుగా వస్తూ ఉంటాయి. అలాంటప్పుడు సహజంగా డాక్టర్ సూచన లేకుండా చాలా మంది తల్లిదండ్రులు నెబ్యులైజర్లను వాడుతూ ఉంటారు. కేవలం కొంచెం దగ్గు వచ్చినప్పుడు దీనిని ఉపయోగిస్తే ఎంతో ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. సహజంగా జలుబు చేసినప్పుడు విపరీతమైన దగ్గుతో పాటుగా చాతిలో శ్వాస తీసుకోవడానికి సంబంధించి ఇబ్బంది ఎదురైతే డాక్టర్లు నెబ్యులైజర్ ను ఉపయోగించమని సూచిస్తారు.
ఆస్తమా, సిఓపిడి, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి మొదలైన శ్వాసకోశ సంబంధించిన వ్యాధులను తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. నెబ్యులైజర్ ద్వారా మందును ఆవిరి లేక పొగ రూపంలో ఊపిరితిత్తులకు అందించవచ్చు. ఈ విధంగా ఊపిరితిత్తులలో ఉండేటువంటి స్రావాలు, స్లేష్మం వంటివి తగ్గుతాయి. కనుక కేవలం ఇటువంటి తీవ్రత ఉన్నప్పుడు మాత్రమే నెబ్యులైజర్లను ఉపయోగించడం సురక్షితం అని నిపుణులు చెబుతున్నారు. అయితే డాక్టర్ ముందుగా స్టెతస్కోప్ తో పిల్లల చాతి శబ్దాన్ని విని తరువాత మాత్రమే నెబ్యులైజర్ ను ప్రీస్క్రైబ్ చేస్తారు.
దానికంటే ముందు స్వయంగా దీనిని ఉపయోగించడం వలన పిల్లల ఆరోగ్యం పై ఎంతో ప్రభావం ఉంటుంది. ఎందుకంటే నెబ్యులైజర్ లో ఉపయోగించే మందులు లో స్టెరాయిడ్స్ ఉంటాయి. వాటి వలన ఎన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. అదేవిధంగా సరైన జాగ్రత్తలు తీసుకోకుండా దీనిని ఉపయోగిస్తే మరింత ప్రమాదం అనే చెప్పవచ్చు. ఎప్పుడైతే నెబ్యులైజర్ పైపులో నీటి కారణంగా తేమ ఉంటుందో దానిలో బ్యాక్టీరియా పెరిగిపోతుంది. దీంతో పిల్లల నోటి దగ్గర పెట్టినప్పుడు బ్యాక్టీరియా అనేది చాతిలోకి చేరుతుంది. ఈ విధంగా మరిన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కనుక సరైన జాగ్రత్తలు తీసుకుని డాక్టర్ సలహాలు ప్రకారం మాత్రమే దీనిని ఉపయోగించాలి.