వర్షాకాలం అంటే అందరికీ ఎంతో ఇష్టం ఆ చల్లని వాతావరణం వేడివేడి ఆహారం, ఎంత బాగుంటుందో కానీ ఈ ఆనందాన్ని పాడు చేసే ఓ చిన్న ప్రమాదం ఉంది. వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది దాని వల్ల కూరగాయలపై బ్యాక్టీరియా, ఫంగస్ తొందరగా పెరుగుతాయి మనం వాటిని సరిగా కడగకపోతే ఇవే మన ఆరోగ్యానికి ముప్పు తెస్తాయి. కాబట్టి వర్షాకాలంలో కూరగాయలు కొనేటప్పుడు వాడేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అవేంటన్నది ఇప్పుడు తెలుసుకుందాం..
ఆకుకూరలు పట్ల జాగ్రత్త : పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు తేమ వల్ల సులభంగా పాడవుతాయి. వాటిపై మట్టి, బురద, సూక్ష్మ క్రిములు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని కొనేటప్పుడు కుళ్ళిన ఆకులు, రంధ్రాలు ఉన్న వాటిని ఎంచుకోకూడదు. కొన్న తర్వాత వేడి నీటిలో ఉప్పు వేసి శుభ్రంగా కడిగి పూర్తిగా ఉడికించిన తర్వాతే తినాలి.
దుంప కూరలు : బంగాళదుంప, క్యారెట్, ఉల్లిపాయ వంటి నేల లోపల పెరిగే కూరగాయలపై తేమ కారణంగా ఫంగస్సు, బ్యాక్టీరియా చేరే అవకాశం ఉంటుంది. వీటిని కొనేటప్పుడు మెత్తగా కూలినట్లుగా ఉన్న వాటిని పక్కన పెట్టండి. పూర్తిగా తీసివేసి శుభ్రంగా కడిగిన తర్వాతే ఉపయోగించండి.
కాలీఫ్లవర్, క్యాబేజీ : ఇలాంటివి పొరల మధ్య తేమ పేరుకుపోయి బ్యాక్టీరియా వృద్ధి చెందుతాయి. వీటిలో పురుగులు ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటిని కొనేటప్పుడు కుళ్ళిన భాగం పసుపు రంగులో మారిన ఆకులు ఉన్నవి తీసుకోకూడదు. కొన్న తర్వాత ఉప్పు నీటిలో కొంచెం సేపు నానబెట్టి ఆ తర్వాత శుభ్రం చేసి బాగా ఉడికిన తర్వాతే తినాలి.

రంధ్రాలు ఉన్న వాటిని వద్దు : వంకాయ, బెండకాయ, బీరకాయ వంటి కూరగాయలు కొనేటప్పుడు వాటిపై ఏమైనా రంధ్రాలు ఉన్నాయేమో చూడండి. రంద్రాలు ఉంటే లోపల పురుగులు ఉన్నట్లు అర్థం కాబట్టి పైన ఎలాంటి మచ్చలు లేదా రంధ్రాలు లేని తాజా కూరగాయలు మాత్రమే ఎంచుకోండి.
ముక్కలు చేసిన కూరగాయలు కొనొద్దు : మార్కెట్లో ముందుగానే ముక్కలు చేసి ప్యాక్ చేసే కూరగాయలు ఈరోజుల్లో ఎక్కువైపోయాయి. ఇలాంటి వర్షాకాలంలో అసలు కొనకూడదు, అవి చాలాసేపటి నుంచి బయట ఉండటం వల్ల బ్యాక్టీరియా సులభంగా పెరుగుతుంది. ఎల్లప్పుడూ తాజాగా ఉండే కూరగాయలనే కొనండి.
పరిశుభ్రత ముఖ్యం : ఏ కూరగాయలు కొన్నా వాటిని ఇంటికి తెచ్చిన వెంటనే వేడి నీటిలో బాగా కడగాలి దీనివల్ల వాటిపై ఉండే క్రిములు, మట్టి తొలగిపోతాయి. వంట చేసే ముందు కూరగాయలను శుభ్రం చేసి ఆ తరువాత వండడం ముఖ్యం.
ఈ జాగ్రత్తలు పాటిస్తే వర్షాకాలంలో కూడా ఆరోగ్యంగా ఉండొచ్చు ఆహారం ద్వారా వచ్చే అనారోగ్య సమస్యలు నివారించవచ్చు.