మన శరీరం ఎప్పటికప్పుడు ఉత్పత్తి చేసే వ్యర్థాల్లో కొన్ని మూత్రం ద్వారా బయటకు వెళ్తుంటాయి. అందువల్ల ఆ పని కోసం కిడ్నీలు నిరంతరం శ్రమిస్తూనే ఉంటాయి. మన శరీరంలోని రక్తాన్ని అవి శుభ్ర పరిచి అందులో ఉండే వ్యర్థాలను వడబోస్తాయి. దీంతో మూత్రం బయటకు వస్తుంది. అయితే కొందరికి మూత్రం దుర్వాసన వస్తుంటుంది. ఇందుకు అనేక కారణాలు ఉంటాయి. అవేమిటంటే…
1. డీహైడ్రేషన్
నిత్యం మనం మన శరీరానికి సరిపోయే విధంగా నీటిని తాగాలి. తక్కువగా నీటిని తీసుకుంటే డీహైడ్రేషన్ సమస్య వస్తుంది. ఈ క్రమంలో మన మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది. కనుక నీళ్లు తక్కువగా తాగేవారు ఎక్కువగా తాగి చూడాలి. మూత్రం దుర్వాసన రాకుండా ఉంటుంది.
2. కాఫీ
కాఫీ ఎక్కువగా తాగేవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంటుంది. కనుక కాఫీ ఎక్కువగా తాగేవారు దాన్ని మితంగా తీసుకోవాలి. లేదంటే కిడ్నీలపై భారం పడుతుంది.
3. మూత్రాశయ ఇన్ఫెక్షన్లు
బాక్టీరియా కారణంగా మూత్రాశయ ఇన్‌ఫెక్షన్లు కొందరిలో ఏర్పడుతుంటాయి. దీని వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంటుంది. అయితే పైన తెలిపిన రెండు సమస్యలను పరిష్కరించుకున్నా మూత్రం దుర్వాసన వస్తుందంటే అందుకు ఇన్‌ఫెక్షన్ కారణమై ఉండవచ్చు. అదే అని భావిస్తే వైద్యున్ని సంప్రదించి పరీక్షలు చేయించుకుని అందుకు అనుగుణంగా మందులను వాడుతూ సమస్యను పరిష్కరించుకోవచ్చు.
4. ఈస్ట్ ఇన్‌ఫెక్షన్
ఈస్ట్ ఇన్‌ఫెక్షన్‌ల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. దీనికి కూడా వైద్య పరీక్షలు చేయించుకుని మందులను వాడాల్సి ఉంటుంది.
5. ఎస్‌టీడీ వ్యాధి
శృంగారంలో పాల్గొనడం వల్ల సంక్రమించే ఎస్టీడీ (సెక్సువల్లీ ట్రాన్స్‌మిటెడ్ ఇన్‌ఫెక్షన్) వ్యాధుల వల్ల కూడా మూత్రం దుర్వాసన వస్తుంది. ఇలా గనక జరిగితే కచ్చితంగా డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి.
6. కిడ్నీ స్టోన్లు
కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారి మూత్రం కూడా దుర్వాసన వస్తుంది. అయితే కిడ్నీ స్టోన్లు ఉంటే సులభంగా తెలిసిపోతుంది. పొట్ట కింది వైపు కుడి, ఎడమ భాగాల్లో అదే భాగంలో వెనుక వైపు నొప్పి వస్తుంది. అలాగే జ్వరం, వాంతులు, రక్తస్రావం కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ లక్షణాలు ఉంటే డాక్టర్‌ను కలిసి చికిత్స తీసుకోవాలి. దీంతో కిడ్నీ స్టోన్ల సమస్యే కాకుండా మూత్రం దుర్వాసన వచ్చే సమస్య కూడా తగ్గుతుంది.
7. డయాబెటిస్, విటమిన్స్
డయాబెటిస్ ఉన్నవారు, విటమిన్ ట్యాబ్లెట్లను ఎక్కువగా వాడేవారి మూత్రం దుర్వాసన వస్తుంది. అయితే డయాబెటిస్ ఉన్నవారు షుగర్ స్థాయిలను అదుపులో ఉంచుకుంటే ఈ సమస్య నుంచి బయట పడవచ్చు. ఇక విటమిన్ ట్యాబ్లెట్లు వాడేవారికి ఆ ట్యాబ్లెట్లను పరిమిత కాలం పాటు తీసుకున్నాక వాటిని తీసుకోవడం ఆపేస్తే మూత్రం దుర్వాసన వచ్చే సమస్య తగ్గుతుంది.