మన రోజువారీ వంటకాల్లో టమోటా లేనిదే ముద్ద దిగదు. అయితే ఈ రుచికరమైన కూరగాయ గురించి ఒక పాత నమ్మకం ప్రచారంలో ఉంది. టమోటా తింటే కిడ్నీలో రాళ్లు వస్తాయని, ఈ విషయం విని చాలా మంది టమోటాను దూరం పెడుతున్నారు. నిజంగా టమోటాలు అంత ప్రమాదకరమా? కిడ్నీ స్టోన్స్ విషయంలో నిపుణులు ఇస్తున్న స్పష్టమైన వివరణ ఏంటో తెలుసుకుందాం.
ఆక్సలేట్ వాస్తవం మరియు అపోహ: టమోటాలలో సహజంగా ఆక్సలేట్ (Oxalate) అనే పదార్థం ఉంటుంది. కిడ్నీలో అత్యంత సాధారణంగా ఏర్పడేవి కాల్షియం ఆక్సలేట్ రాళ్లు. ఈ కారణంగానే టమోటాలు తినడం వల్ల రాళ్లు పెరుగుతాయనే అపోహ మొదలైంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి సాధారణ మోతాదులో టమోటాలు తీసుకుంటే ఎలాంటి ప్రమాదం ఉండదు. 100 గ్రాముల టమోటాలో కేవలం 5 గ్రాముల ఆక్సలేట్ మాత్రమే ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి ఇది చాలా తక్కువ పరిమాణం. కిడ్నీ స్టోన్స్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు శరీరంలో నీటి కొరత జన్యుపరమైన అంశాలు మరియు మొత్తం ఆహారపు అలవాట్లు, కేవలం టమోటా మాత్రమే కాదు.

వీరు మాత్రమే జాగ్రత్త పడాలి: టమోటాలు అందరికీ ప్రమాదకరం కానప్పటికీ కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు మాత్రం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదివరకే కిడ్నీ రాళ్లు (ముఖ్యంగా కాల్షియం ఆక్సలేట్ రాళ్లు) ఉన్నవారు లేదా తరచుగా రాళ్లు వచ్చే చరిత్ర ఉన్నవారు. ఆక్సలేట్‌ను ఎక్కువగా శోషించుకునే శరీర తత్వం ఉన్నవారు.
ఇలాంటి పరిస్థితుల్లో టమోటాలు (విత్తనాలతో సహా) మరియు ఆక్సలేట్ అధికంగా ఉండే ఇతర ఆహారాలైన పాలకూర, బీట్రూట్ వంటి వాటిని మితంగా తీసుకోవడం లేదా వైద్యుడి సలహా మేరకు పూర్తిగా మానేయడం మంచిది.
టమోటాలు అత్యంత ఆరోగ్యకరమైనవి వీటిలో విటమిన్-సి, విటమిన్-ఎ, పొటాషియం మరియు ముఖ్యంగా క్యాన్సర్ నిరోధక శక్తి ఉన్న లైకోపీన్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి మీకు కిడ్నీ స్టోన్స్ చరిత్ర లేకపోతే, టమోటాల విషయంలో భయపడాల్సిన అవసరం లేదు. మోతాదులో ఉంటే ఏ ఆహారమైనా ఆరోగ్యానికి మేలే చేస్తుంది.
టమోటాల వల్ల వచ్చే ప్రయోజనాలు చాలా ఎక్కువ. కిడ్నీ స్టోన్స్ ఉన్నవారు వైద్యుడిని సంప్రదించి, ఆక్సలేట్ నియంత్రణకు సంబంధించిన ఆహార సలహాలను పాటించడం ఉత్తమం.
