నవ్వుకి శక్తి ఉంది అని అందరికి తెలియకపోవచ్చు.. ఉదయం లేచిన వెంటనే కాఫీ తాగడం, పేపర్ చదవడం ఎంత ముఖ్యమో, మన జీవితంలో నవ్వు కూడా అంతే అవసరం. మనం నవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, కానీ ఆ నవ్వు మన జీవితాన్ని, ఆరోగ్యాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. రోజులో కేవలం 5 నిమిషాలు నవ్వడం ద్వారా మీ మానసిక, శారీరక ఆరోగ్యం ఎలా మెరుగుపడుతుందో తెలుసా?
అవును ఇది కేవలం ఊరికే చెప్పే మాట కాదు, నవ్వు ఒక శక్తివంతమైన మెడిసిన్. మీరు దేనికోసమో ఎదురుచూడకుండా, ఈరోజే నవ్వడం మొదలుపెట్టండి మీ లైఫ్ స్టైల్‌లో ఇది ఒక అలవాటుగా మారితే వచ్చే అద్భుతమైన మార్పులను మీరే గమనించవచ్చు.
నవ్వడం అనేది మన శరీరానికి ఒక ఉచిత వ్యాయామం లాంటిది. మనం మనస్ఫూర్తిగా నవ్వినప్పుడు, మన గుండె వేగం పెరుగుతుంది, దాంతో రక్తప్రసరణ మెరుగుపడుతుంది. ఇది అధిక రక్తపోటును తగ్గించడానికి సహాయపడుతుంది, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ఇంకా నవ్వడం వల్ల మన శరీరంలో ‘ఎండార్ఫిన్స్’ అనే హ్యాపీ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి సహజంగా నొప్పి నివారిణిగా పనిచేస్తాయి, ఒత్తిడి హార్మోన్లయిన ‘కార్టిసాల్’ స్థాయిలను తగ్గిస్తాయి.

ఆఫీసులో పని ఒత్తిడి, ఇంట్లో చిరాకులు, లేదా రోజంతా ఎదురయ్యే చిన్న చిన్న సమస్యలు, ఇలాంటివాటిని ఎదుర్కోవడానికి కేవలం 5 నిమిషాల నవ్వు అద్భుతమైన బూస్టర్‌గా పనిచేస్తుంది. నవ్వు మన రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ తోడ్పడుతుంది. నవ్వడం వల్ల శరీరంలో యాంటీబాడీస్ ఉత్పత్తి పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇది మనల్ని ఇన్ఫెక్షన్ల నుండి కాపాడుతుంది. మీరు ఎంత ఎక్కువగా నవ్వితే అంత ఆరోగ్యంగా, చురుకుగా ఉంటారు. నవ్వు కేవలం మన ఆత్మవిశ్వాసాన్ని పెంచడమే కాక ఇతరులతో మన సంబంధాలను కూడా బలపరుస్తుంది. అందరూ నవ్వుతూ ఉండే మనిషిని ఇష్టపడతారు, వారి చుట్టూ ఉండాలని కోరుకుంటారు.
చూశారా రోజూ 5 నిమిషాలు నవ్వడం వల్ల మీ ఆరోగ్యం ఎంత గొప్పగా మెరుగుపడుతుందో.. ఇది పెద్ద ఖర్చుతో కూడిన పని కాదు ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించాల్సిన అవసరం కూడా లేదు. ఉదయం ఒక ఫన్నీ వీడియో చూడటం, సరదాగా మాట్లాడే స్నేహితుడితో ఫోన్‌లో మాట్లాడటం, లేదా మిమ్మల్ని మీరు అద్దంలో చూసి నవ్వుకోవడం ఇలా ఏదైనా సరే, రోజుకు 5 నిమిషాలు మనస్ఫూర్తిగా నవ్వండి. ఈ చిన్న అలవాటు మీ జీవితంలో పెద్ద మార్పు తీసుకురావడం ఖాయం.
గమనిక: నవ్వు అనేది ఆరోగ్యానికి సహకరించే ఒక మంచి అలవాటు మాత్రమే, ఇది వైద్య చికిత్సకు ఏ మాత్రం ప్రత్యామ్నాయం కాదు.
