పీరియడ్స్ సమయంలో పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి వంటివి అందరికీ తెలిసినవే. కానీ చాలామంది మహిళలు ఈ సమయంలో బీపీ పెరగడం లేదా తగ్గడం వంటి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటుంటారు. అకస్మాత్తుగా నీరసం రావడం తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే అది రక్తపోటులో మార్పుల వల్లే కావచ్చు. పీరియడ్స్ రావడానికి కొన్ని రోజుల ముందు నుండి, పీరియడ్స్ ముగిసే వరకు శరీరంలో జరిగే హార్మోన్ల యుద్ధం మన రక్త ప్రసరణపై కూడా ప్రభావం చూపుతుంది. అసలు పీరియడ్స్‌కు, బీపీకి ఉన్న ఆ సంబంధమేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
హార్మోన్ల ప్రభావం: పీరియడ్స్ సమయంలో మన శరీరంలో ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ అనే రెండు ప్రధాన హార్మోన్ల స్థాయిలు వేగంగా మారుతుంటాయి. పీరియడ్స్ రావడానికి ముందు ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గడం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోయి, కొంతమందిలో రక్తపోటు (High BP) పెరగవచ్చు.
అలాగే ఈ సమయంలో శరీరంలో సోడియం (ఉప్పు) నీరు నిల్వ ఉండటం వల్ల కూడా బీపీ పెరిగే అవకాశం ఉంటుంది. మరోవైపు పీరియడ్స్ సమయంలో రక్తస్రావం ఎక్కువగా ఉండటం వల్ల శరీరంలో రక్త పరిమాణం తగ్గి దానివల్ల బీపీ పడిపోవడం జరుగుతుంది. దీనివల్ల చాలామందికి విపరీతమైన నీరసం కళ్ళు తిరగడం వంటివి సంభవిస్తాయి.

నీరసం మరియు కళ్ళు తిరగడం: పీరియడ్స్ సమయంలో బీపీ తగ్గడానికి ‘అనీమియా’ లేదా రక్తహీనత ఒక ప్రధాన కారణం. ఐరన్ లోపం ఉన్న మహిళల్లో రక్తస్రావం జరిగినప్పుడు హిమోగ్లోబిన్ స్థాయిలు పడిపోయి, కణాలకు ఆక్సిజన్ అందడం తగ్గుతుంది. ఫలితంగా గుండె వేగంగా కొట్టుకోవడం, ఆయాసం రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా ఈ సమయంలో వచ్చే మానసిక ఒత్తిడి, ఆందోళన మరియు సరిగ్గా నిద్ర పట్టకపోవడం కూడా బీపీలో హెచ్చుతగ్గులకు దారితీస్తాయి.
పరిష్కార మార్గాలు:పీరియడ్స్ సమయంలో బీపీని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని చిన్న మార్పులు సరిపోతాయి. ఉప్పు ఎక్కువగా ఉండే జంక్ ఫుడ్స్, కెఫీన్ (కాఫీ, టీ) ని ఈ సమయంలో తగ్గించాలి. రోజంతా ధారాళంగా నీరు తాగడం వల్ల డీహైడ్రేషన్ బారిన పడకుండా ఉండవచ్చు.
అలాగే ఐరన్, మెగ్నీషియం సమృద్ధిగా ఉండే ఆకుకూరలు, డ్రై ఫ్రూట్స్ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఒకవేళ బీపీ అకస్మాత్తుగా పడిపోతున్నట్లు అనిపిస్తే కాసేపు కాళ్లు పైకి పెట్టి పడుకోవడం వల్ల రక్త ప్రసరణ మెదడుకు సజావుగా అందుతుంది. యోగా లేదా చిన్నపాటి వ్యాయామం ద్వారా ఒత్తిడిని తగ్గించుకుంటే హార్మోన్ల సమతుల్యత దెబ్బతినకుండా ఉంటుంది.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం ఆవాహన కోసం మాత్రమే, ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.
