డెలివరీ తర్వాత బాలింతలు ఎదుర్కునే సాధారణ సమస్యలు ఇవే..!

-

ప్రెగ్నెన్సీ కన్ఫామ్‌ అయినప్పటి నుంచి ఆ స్త్రీకి వచ్చే రెండేళ్ల వరకూ రెస్ట్‌ ఉండదు. ముందు డెలివరీ టైమ్‌ వరకూ ఒక సమస్య అయితే.. డెలివరీ అయినప్పటి నుంచి ఇంకొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక బిడ్డకు కనీసం రెండు ఏళ్లు వచ్చే వరకూ వారికి రెస్ట్‌ అనేది ఉండదు. ప్రసవం తర్వాత బాలింతలకు కొన్ని సమస్యలు ఉంటాయి. శారీరక, మానసిక లక్షణాలలో మార్పును కలిగి ఉంటారు. బిడ్డకు పాలు అందించే ప్రక్రియలోనూ తల్లి శరీరం గణనీయమైన రూపాంతరం చెందుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం, డెలివరీ తర్వాత ఆ తల్లి కోలుకోవడానికి కొంత సమయం కావాలి. ముఖ్యంగా మొదటిసారి తల్లిగా మారినవారు వారి శరీరంలో జరిగే మార్పులను సర్దుబాటు చేయడానికి కష్టపడతారు. బాలింత ఆరోగ్యం, డెలివరీ అయిన విధానాన్ని బట్టి రికవరీ పీరియడ్ ఒక్కో కేసుకు మారుతూ ఉంటుంది. కొందరు రోజుల వ్యవధిలోనే కోలుకుంటారు, మరికొందరికి కోలుకోవడానికి కొన్ని వారాలు, నెలలు అయినా పడుతుంది.

ప్రసవం తర్వాత బాలింత స్త్రీ ఎదుర్కొనే కొన్ని సాధారణ సమస్యలు

బలహీనత

డెలివరీ సమయంలో చాలా రక్తాన్ని కోల్పోవడం వల్ల, స్త్రీ చాలా వీక్‌ అవుతుంది. ఆమెలో నీరసం, అలసట ఉంటాయి. ప్రసవించిన తర్వాత బాలింతలు తమ శరీరంలో ఇనుము లోపాన్ని ఎదుర్కొనే అవకాశం ఉంది. కాబట్టి వారికి బలవర్ధకమైన ఆహారం అవసరం అవుతుంది. మెత్తటి మటన్, తృణధాన్యాలు, బీన్స్, కాయధాన్యాలు, ఆకు కూరలు ఆహారంగా అందివ్వాలి. అలాగే విటమిన్లు, మినరల్స్ ముఖ్యంగా ఇనుము అధికంగా ఉండే ఆహారాలను అందివ్వడం ద్వారా వారి శరీరంలో రక్తం స్థాయిలను పెంచడానికి సాధ్యమవుతుంది.

ఉబ్బిన శరీర భాగాలు

నార్మల్‌ డెలివరీ లేకా సీ సెక్షన్‌ ద్వారా డెలివరీ జరిగినప్పుడు వాటివల్ల వచ్చే మార్పులు కూడా వేరుగా ఉంటాయి. సాధారణ ప్రసవం అయితే యోని ప్రాంతంలో గాయం అవుతుంది, సి-సెక్షన్ అయితే బొడ్డు భాగంలో కోత ఉంటుంది. ఈ ప్రకారంగా ఆయా శరీర భాగాలలో వాపు ఉండవచ్చు. అయితే కొన్ని వారాలలో పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి.

మలబద్ధకం

ప్రసవం తర్వాత వివిధ రకాల శారీరక, మానసిక మార్పులు, వీటి వలన కలిగే ఒత్తిడి కారణంగా మలబద్ధకం సమస్య, మూత్ర విసర్జన సమస్యలు ఉండవచ్చు.

హార్మోన్ హెచ్చుతగ్గులు

ప్రసవం తర్వాత, తల్లి శరీరం హార్మోన్ల హెచ్చుతగ్గులను ఎదుర్కొంటుంది. ఆక్సిటోసిన్ స్థాయిలు పెరుగుతాయి, ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ స్థాయిలు తగ్గుతాయి. దీనివలన వారిలో ఒకరకమైన ఆందోళన ఉంటుంది. మానసిక కల్లోలం, ఆందోళన, చిరాకు వంటివి కొత్తగా తల్లి అయిన వారు ఎదుర్కొనే ఒక సమస్య.

ప్రసవానంతర రక్తస్రావం

ప్రసవానంతరం లోచియా అని పిలిచే ఉత్సర్గ ఉంటుంది. ఇది ఋతుచక్రాన్ని పోలి ఉంటుంది. ఇంతకాలం పీరియడ్స్ రాలేవు కాబట్టి, ఇప్పుడు మళ్లీ పిరియడ్స్ మొదలవుతాయి. డెలివరీ తర్వాత నాలుగు లేదా ఆరు వారాల వరకు ఈ రక్తస్రావం ఉండవచ్చు. ఇది ప్రతీ బాలింత ఎదుర్కొనే అత్యంత సాధారణ లక్షణం. ఈ ఉత్సర్గలో రక్తంతో పాటు, శ్లేష్మం, గర్భాశయ కణజాల మిశ్రమాన్ని కలిగి ఉంటుంది.

గర్భందాల్చిన నాటి నుంచి డెలివరీ అయిన తర్వాత కొన్ని నెలల వరకూ వారి ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. తినే ఆహారం, చేసే పని ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. ఏ దశలోనూ స్త్రీ ఒత్తిడి, ఆందోళనకు గురికాకూడదు. ఎలాంటి సమస్య ఎదురైనా వెంటనే వైద్య సహాయం పొందాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version