సూక్ష్మ క్రిములను నాశనం చేయడం కోసం హ్యాండ్ శానిటైజర్లే ఉత్తమంగా పనిచేస్తాయా ? దీనిపై చర్మ వైద్య నిపుణులు ఏమంటున్నారు ? కోవిడ్ నేపథ్యంలో శానిటైజర్ల వాడకంపై చాలా మందిలో నెలకొన్న అపోహలు, వారికి ఉండే సందేహాలపై వైద్య నిపుణులు ఇస్తున్న సమాధానాలు…
కోవిడ్ నేపథ్యంలో ప్రస్తుతం అనేక మంది లీటర్ల కొద్దీ శానిటైజర్లను కొనుగోలు చేసి ఇండ్లలో నిల్వ చేసుకుంటున్నారు. వాటిల్లో 60 నుంచి 90 శాతం వరకు ఆల్కహాల్ ఉంటుంది కనుక ఆ శానిటైజర్లు సూక్ష్మక్రిములను నాశనం చేస్తాయి. అయితే కేవలం అవే కాదు.. చేతులను శుభ్రం చేసుకోవడానికి ఇంకా మనకు అనేక రకాల ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి.
1. కేవలం హ్యాండ్ శానిటైజర్ మాత్రమే క్రిములను చంపుతుందా ?
కాదు. సబ్బుతో కూడా చేతులను శుభ్ర పరుచుకోవచ్చు. కాకపోతే చేతులను కనీసం 20 సెకన్ల పాటు కడగాలి. శానిటైజర్లను ఎక్కువగా ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో అలర్జీలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. చర్మం పొడిబారుతుంది. పొలుసులుగా చర్మం ఊడి వస్తుంది. చర్మం దురదగా మారుతుంది. గజ్జి, తామర వంటి చర్మ వ్యాధులు ఎక్కువగా వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక శానిటైజర్లను పరిమితికి మించి వాడరాదు.
2. శానిటైజర్‌ను వాడినంత కాలం సేఫ్‌గా ఉన్నట్లే ?
శానిటైజర్లను వాడుతున్నాం కదా.. మనం 100 శాతం సురక్షితంగా ఉన్నట్లేనని కొందరు అనుకుంటారు. కానీ అది నిజం కాదు. ఎందుకంటే.. ఎంత శానిటైజర్ వాడిన కోవిడ్ నేపథ్యంలో మన జాగ్రత్తలు మనం పాటించాల్సిందే. వీలైనంత వరకు భౌతిక దూరం పాటించాలి. మాస్కులను ధరించాలి. ఇతరులను టచ్ చేయరాదు. శానిటైజర్ వాడకంతోపాటు ఈ సూచనలను పాటిస్తేనే మనం సేఫ్‌గా ఉంటాం. లేదంటే కరోనా బారిన పడాల్సి వస్తుంది.
3. సబ్బు లేదు, శానిటైజర్ వాడాలా ?
వీలైనంత వరకు ఎవరైనా సరే సబ్బు లేదా శానిటైజర్ ఏది అందుబాటులో ఉంటే అది వాడవచ్చు. కానీ సబ్బు ఉంటే దాన్నే వాడితే ఉత్తమం. 20 సెకన్ల పాటు సబ్బుతో చేతులు కడుక్కుంటే చాలు.. శానిటైజర్ లాంటి రక్షణ లభిస్తుంది. సబ్బు లేనప్పుడు మాత్రమే శానిటైజర్ వాడాలి. శానిటైజర్‌ను అత్యధికంగా ఉపయోగిస్తే చర్మ సమస్యలు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
4. ఒక్క శానిటైజర్ డ్రాప్‌తో క్రిములను చంపవచ్చు ?
కాదు.. అలా చంపలేం. సరిపోయినంత శానిటైజర్‌ను చేతుల్లో వేసుకుని రాసుకోవాల్సిందే. ఒక్క శానిటైజర్ డ్రాప్ క్రిములను చంపుతుందని అనడంలో నిజం లేదు. చేతులకు మొత్తం సరిపోయేంత శానిటైజర్‌ను తీసుకుని అప్లై చేయాల్సిందే. తక్కుగా వాడితే వైరస్ వ్యాప్తి చెందేందుకు అవకాశం ఉంటుంది.