1200 మందికి ఉచిత చికిత్స.. 35000 చెట్లు నాటిన డాక్టర్

-

సుమారు 46 ఏండ్ల నుంచి ప్రతి ఆదివారం హాస్పిటల్‌కు వెళ్లాల్సిందే. అక్కడికి వచ్చే పేషంట్లు సుమారు 1200 మందికి ఉచితంగా చికిత్స చేస్తున్నాడు. ఈ సేవ అంతటితో ఆగలేదు. డాక్టర్‌గానే కాకుండా సామాన్యుడిగా గ్రామంకోసం ఎన్నో పనులు చేపట్టాడు. ప్రజల ఆనందమే తన సంతోషంగా బావించాడు. ప్రజల ఆరోగ్యాన్ని కాపాడేందుకు 35000 చెట్లను నాటాడు. ఊరికోసం 700లకు పైగా మరుగుదొడ్లు నిర్మించాడు. ఈ సేవాగుణం ఇప్పుడు ఏర్పడింది కాదు. ఈ పనులు చేయడం అంత సులువు కాదు. దీనికి కొన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాడు. వాటని ఏ విధంగా అమలుచేసుకున్నాడు? అతనికి తోడుగా ఎవరు నిలబడ్డారు? ఇంతకీ అతను ఎవరో తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే..

అతని పేరు డాక్టర్‌ బి. రమణారావు. ఈయన బెంగళూరుకి చెందిన వాడు. తండ్రి ఛీప్‌ ఇంజినీర్‌. ఉద్యోగం పరంగా భద్రావతి అటవీ ప్రాంతాలకు ట్రాన్సఫర్‌ అయ్యాడు. కొంతకాలం అక్కడే ఉన్నారు. ఆ చుట్టుపక్కల చిన్న హాస్పిటల్స్‌ కూడా లేవు. ప్రజలకు చిన్న రోగం వచ్చినా చూసేందుకు వైద్యం లేదు. గ్రామాలకు దూరంగా ఉన్న హాస్పిటల్స్‌లో భరించలేని ఫీజులు. పేదరికం అక్కడి ప్రజలను పీక్కుతింటుంది. రమణారావు చుట్టూ సమస్యలు తిరుగుతూనే ఉండేవి. రావు రక్తం మరిగిపోయేది. ఏం చేస్తాడు. చిన్నపిల్లాడు అప్పుడు. వీరికి వైద్యం అందించాలంటే రమణారావు డాక్టర్‌ అవ్వాలి. ప్రజలకు మంచి జరుగుతుందంటే డాక్టర్‌ అయి తీరుతానంటూ పట్టు విక్రమార్కుడిలా మారాడు.

డయాబెటిస్‌, అలెర్జీలు, గుండె జబ్బులు ఎలాంటివాటికైనా వైద్యం అందిస్తున్నాడు రావు. బెంగళూరుకు దగ్గరగా టి.బెగర్‌ గ్రామం, తుమకూరు రహదారికి సమీపంలో రావు చిన్న హాస్పిటల్‌ స్థాపించాడు. ఇది ప్రపంచంలోనే అతి పురాతనమైన ఉచిత హాస్పిటల్‌గా పేరుగాంచింది. ప్రాథమిక చికిత్సతో పాటు డా. రావు ఉచిత రక్తపోటు, రక్త పరీక్షలు, ఎలక్ట్రో కార్డియోగ్రఫీ(ఇసిజి), నెబ్యులైజేషన్‌, డయాబెటిస్‌ పరీక్షలు మొదలైనవి అందిస్తున్నాడు. రావుతో పాటు 35 మంది ప్రత్యేక బృందం నర్సులు, కాంపౌడర్లు, ల్యాబ్‌ టెక్నీషియన్లు ఉన్నారు. నెలకు ఒకసారి రోటరీ ఐ హాస్పిటల్‌ వైద్యులు రావు క్లినిక్‌ వద్ద కంటి శిబిరం నిర్వహిస్తున్నారు. అక్కడ ఆప్టికల్‌ పరీక్షలతోపాటు ఉచిత కంటిశుక్లం శస్త్రచికిత్సలు అందిస్తున్నారని రావు అంటున్నాడు. అంతేకాదు ఈ క్లినిక్‌లో అనుభవజ్ఞులైన దంతవైద్యులు, దంత శస్త్రచికిత్సలతో ప్రత్యేకమైన దంత యూనిట్‌ కూడా ఉంది.

జర్నీ మొదలైంది..
రమణారావు డాక్టర్‌ కావాలనే పట్టుదలతో 1974 ఆగస్ట్‌ 15న ఎంబిబిఎస్‌ డిగ్రీ పట్టా పొందాడు. డాక్టర్‌ కావాలన్న అతని ఏకైక లక్ష్యం నిరుపేదలకు సేవ చేయడమే. రావు పేరు కాస్త డాక్టర్‌ రావుగా మారింది. టి.బెగూర్‌లో వీరికి కొంత భూమి ఉంది. ఆ ప్రదేశంలో హాస్పిటల్‌ కట్టేందుకు తల్లిదండ్రులు అనుమతించారు. హాస్పిటల్‌ స్థాపించాడు. వారమంతా డాక్టర్‌ రావు బెంగళూరులోని ఫేమస్‌ హాస్పిటల్‌సలో శిక్షణ తీసుకునేవాడు. ఆదివారం ఉదయం మాత్రం టి.బెగూర్‌ వైపుకు వెళ్తాడు.ఆయన ఆదాయంలో సగం నిస్సహాయ గ్రామస్తులకు మందులు కొనడానికి ఖర్చు చేస్తాడు. మొదట్లో 40 నుంచి 50 పేషంట్లు వచ్చేవారు. సంఖ్య పెరిగడంతో ఎండొచ్చినా, నానొచ్చినా బయట క్యూలో నిలబడేవారు. ఎండదెబ్బకి ప్రజలు అల్లాడిపోతున్నారు. వీరికోసం క్లినిక్‌ నుంచి కిలోమీటర్‌ దూరం వరకు షెడ్‌ నిర్మించాడు. ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించడానికి యోగాను పరిచయం చేశాడు. అందుకు ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించాడు. హాస్పిటల్‌కు వచ్చే పేషంట్లకు సరైన పోషకాలు అందకపోవడంతో మరింత బలహీనంగా తయారవుతున్నారు. హాస్పిటల్‌లో ఉండే రోగులకు భోజనం, స్నాక్స్‌ కూడా ఏర్పాటు చేశాడు. ఖాళీ కడుపుతో ఎవరూ బయటకు వెళ్లకూడదనుకున్నాడు. వీరంతా అనారోగ్యబారిన పడడానికి కారణం గ్రహించాడు.

ప్రాజెక్టులు చేపట్టాడు
మరుగుదొడ్లు లేని కారణంగా బహిరంగ ప్రదేశాలలో తిరుగడంతో అనారోగ్య బారిన పడుతున్నారు. 1991లో మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభించాడు. అప్పటి నుంచి ఇప్పటికీ 700కు పైగా కట్టించాడని అంటున్నాడు. కర్ణాటకలోని చాలా ప్రాంతాల్లో నీటికొరత ఏర్పడింది. ఇలాంటివి పదహారు గ్రామాల్లో డాక్టర్‌ రావు ఇంటర్‌లింక్‌డ్‌ బోర్‌వెల్స్‌ తవ్వించాడు. దీంతో నీటి సమస్యలను పరిష్కరించాడు. వర్షాలు పడకపోవడానికి కారణం చెట్ల సంఖ్య తక్కువవ్వడం. చెట్లు నాటడం మొదలుపెట్టాడు. ఇప్పటివరకు 35000 కంటే ఎక్కువ చెట్లను నాటాడు. ప్రస్తుతం డాక్టర్‌ రావు బెంగళూరులోని దాదాపు అన్ని ప్రధాన హాస్పిటల్‌లో కార్డియాలజీ, ఇంటర్నల్‌ మెడిసిన్‌ కన్సల్టెంట్‌ డాక్టర్‌గా చేస్తున్నాడు. హాస్పిటల్‌కు వచ్చిన ప్రతిరోగిని ప్రేమగా పలుకరిస్తాడు. ధైర్యం చెబుతాడు. అతను చేసిన సేవకు ఎవ్వరూ సరితూగలేరని రావు మేనేజర్‌ త్రిపురేంద్ర నొక్కిచెబుతున్నాడు. డాక్టర్‌ రావు కృషికి గాను మాజీ రాష్ట్రపతి ప్రతాభా పాటిల్‌ చేతులు మీదుగా ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్నాడు.

తోడుగా కుటుంబం
డాక్టర్‌ రావు ఇన్ని పనులు చేపట్టడానికి కుటుంబసాయం ఎంతో ఉంది. అతని భార్య హేమ తోడుగా ఉంటుంది. అతని కుమారులు, ఇద్దరు కుమార్తెలతోపాటు చర్మవ్యాధి నిపుణడు, పోషకాహార నిపుణుడు ఆదివారం నాడు హాస్పిటల్‌కు వస్తారు. రావు మనవళ్లు, మనవరాళ్లు క్లినిక్‌లో భోజనం వడ్డించడానికి వస్తుంటారు. కుటుంబ వ్యవహారాలన్నీ హేమానే చూసుకుంటుంది. హాస్పిటల్‌కు జనం తండోపతండాలు వస్తారు. ఆ క్యూని చూసిన వారెవ్వరూ హాస్పిటల్‌ అనుకోరు. పేద ప్రజలకు తోడుగా డా. రావు ఎప్పుడూ ఉంటాడని ప్రజల నమ్మకం.

Read more RELATED
Recommended to you

Exit mobile version