సీబీఐ.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్.. కేంద్రానికి చెందిన దర్యాప్తు సంస్థ అది. ఇండిపెండెంట్ బాడీ. అటువంటి అత్యున్నత సంస్థకు డైరెక్టర్‌గా మరోసారి తెలంగాణ బిడ్డకు అవకాశం లభించింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంగపేట మండలంలోని బోరు నర్సాపురం గ్రామానికి చెందిన ఐపీఎస్ ఆఫీసర్ మన్నెం నాగేశ్వర రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఇదివరకు 1993 నుంచి 1996 వరకు సీబీఐ డైరెక్టర్‌గా తెలంగాణలోని ఇదే జిల్లా ఏటూరునాగారానికి చెందిన కాకులమర్రి విజయరామారావు పనిచేశారు. తెలంగాణ రాష్ట్రం నుంచి సీబీఐ డైరెక్టర్‌గా పనిచేసిన మొదటి వ్యక్తి విజయరామారావు కాగా.. రెండో వ్యక్తి మన్నెం నాగేశ్వర రావు. ఈయన్ను అంతా ఎమ్మెన్నార్ అని పిలుస్తుంటారు.
ఎమ్మెన్నార్ 1986లో సివిల్స్ రాసి ఐపీఎస్ అయ్యారు. ఒడిశా క్యాడర్ ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. ఆ తర్వాత దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన చాలా కేసుల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఛత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాలో పనిచేశారు. సీబీఐ జాయింట్ డైరెక్టర్‌గా పనిచేసిన వీవీ లక్ష్మీనారాయణ తర్వాత 2016లో జేడీగా నాగేశ్వరరావు నియమితులయ్యారు. అనంతరం తాజాగా ఆయన్ను తాత్కాలిక డైరెక్టర్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నాగేశ్వరరావు పట్టుదల, దీక్ష, అంకితభావమే ఆయన్ను అంచెలంచెలుగా ఎదిగేలా చేసిందని.. అందుకే ఆయన ఇప్పుడు ఉన్నత స్థానంలో ఉండి తెలంగాణ ఖ్యాతిని, ఆయన ఊరు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారని ఎమ్మెన్నార్ బంధువులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.