స్టూడెంట్ నెం.1 సినిమా లానే..! తండ్రి కోసం లాయరై వారికి శిక్షపడేలా చేసిన కూతురు

-

మీ అందరికి స్టూడెంట్ నెంబర్ 1 సినిమా గుర్తుండే ఉంటుంది కదా.. అప్పట్లో మరీ ఆ సినిమాకు మామూలు క్రేజ్ రాలేదు. నిర్దోషి అయిన తండ్రిని విడిపించడానకి ఎన్టీఆర్ లాయర్ అయి..కేసు గెలుస్తాడు. సరిగ్గా ఇలానే జరిగింది.. బంగ్లాదేశ్ కు చెందిన షెగుఫ్తా తబసుమ్ అహ్మద్ జీవితంలో. ‌ఈమె కథ కూడా అచ్చం ఈ సినిమా కథనే తలపిస్తుంది. ఉద్దేశపూర్వకంగా తన తండ్రిని హత్య చేసిన నరహంతకులకు తగిన శిక్ష పడేలా చేసేందుకు ఏకంగా ఆమె న్యాయవిద్యనే అభ్యసించింది. సుమారు 16 ఏళ్ల పాటు పోరాడి తాజాగా కేసులో గెలిచింది. న్యాయం ఎప్పటికైనా..గెలుస్తుంది అని ఈమె మరోసారి ప్రూవ్ చేసింది. ఈమె కథ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.. మనమూ చూసేద్దామా..!
బంగ్లాదేశ్‌కు చెందిన తాహెర్‌ అహ్మద్‌ అక్కడి ఓ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తించేవారు. 2006, ఫిబ్రవరి 1న ఆయన కిడ్నాప్‌కు గురయ్యారు. రెండు రోజుల అనంతరం తాహెర్‌ శవం ఓ మ్యాన్‌హోల్‌లో దొరికింది. దీంతో కన్నీరుమున్నీరైన ఆయన కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా ఈ హత్య వెనుక ఆరుగురు నిందితులున్నట్లు తేల్చారు.
తాహెర్‌కు తన కూతురు షెగుఫ్తా తబసుమ్ అహ్మద్‌ను లాయర్‌ చేయాలని కోరిక. ఆమెకు దానిపై పెద్దగా ఆసక్తి లేకపోయినా నాన్న మాటను కాదనలేక ఒప్పుకుంది.. దీంతో తాహెర్‌ చనిపోవడానికి కొన్ని రోజుల ముందు తనే స్వయంగా తన కూతురిని స్థానిక లా కాలేజీలో చేర్పించారు. ఆ తర్వాత తండ్రిని కోల్పోవడంతో కొన్ని రోజుల పాటు తన చదువు ఆగిపోయింది.. ఇక అదే సమయంలో కేసులో ప్రధాన నిందితుడు బెయిల్‌పై విడుదలవడం షెగుఫ్తాకు అస్సలు నచ్చలేదు. తన తండ్రిని చంపిన వారికి శిక్షపడేలా చేయాలని అప్పుడే డిసైడైంది. ఈ కేసును ఎవరో వాదిస్తే తన తండ్రికి న్యాయం జరగదని, ఆయన ఆత్మ శాంతించదని అనుకున్న ఆమె.. తానే లాయరై కేసును టేకప్‌ చేయాలని నిర్ణయించుకుంది.. పట్టుబట్టి న్యాయవిద్యను అభ్యసించింది.

తొమ్మిదేళ్ల పోరాటం

లాయర్ విద్యను అభ్యసించిన షెగుఫ్తా ఆపై ఢాకా బార్‌ అసోసియేషన్‌లో సభ్యత్వం తీసుకుంది.. తన తండ్రి కేసును టేకప్‌ చేసింది. కేసు విచారణ సమయంలో నిందితులు పలుమార్లు తప్పించుకోవాలని చూసినా.. చేసిన తప్పుకు శిక్ష పడాలని పట్టుబట్టిందీ యంగ్‌ లాయర్‌. ఈ క్రమంలోనే పూర్వాపరాలు పరిశీలించిన రాజ్‌షాహీ సిటీ కోర్టు 2008లో నలుగురు దోషులకు మరణ దండన విధిస్తూ తీర్పునివ్వడంతో పాటు మరో ఇద్దరిని నిర్దోషులుగా విడుదల చేసింది. దీంతో నిందితులు అక్కడి హైకోర్టును ఆశ్రయించారు. 2013లో హైకోర్టు ఈ నలుగురిలో ఇద్దరు నిందితులకు మరణ దండన, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ తీర్పును సవాల్‌ చేస్తూ నిందితులు సుప్రీం కోర్టును ఆశ్రయించారు. అప్పట్నుంచి తొమ్మిదేళ్ల పాటు ఈ కేసుపై పోరాటం చేస్తూ వచ్చిన షెగుఫ్తాకు ఆఖరికి విజయం సాధించింది.

తోటి ఉద్యోగులే దోషులు..

ఈ కేసులోని దోషులు తాహెర్‌ ప్రొఫెసర్‌గా పనిచేసిన యూనివర్సిటీలో చదువుకున్న వారే..ఆయనతో కలిసి పనిచేసిన వారు..డబ్బు, ఉన్నత పదవుల కోసమే ఇంతటి ఘాతుకానికి ఒడిగట్టారని విచారణలో తెలుసుకున్న సుప్రీం కోర్టు అప్పీలు విభాగం.. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ దోషుల్లో ఇద్దరికి మరణ దండన, మరో ఇద్దరికి జీవిత ఖైదు విధిస్తూ తుది తీర్పు వెల్లడించింది. దీంతో చేపట్టిన తొలి కేసుతోనే గెలుపు రుచి చూసిందీ డేరింగ్‌ లాయర్‌.
ఇలా మొత్తానికి కేసు ప్రారంభం నుంచి 16 ఏళ్ల పాటు అలుపు లేకుండా అంకితభావంతో పోరాడి..ఎట్టకేలకు 16 ఏళ్లకు విజయం దక్కింది. ఈ క్రమంలో ఎన్నో ఎత్తుపల్లాలు ఎదుర్కొన్నా.. మరెన్నో విషయాలు తెలుసుకున్నా.. ఆఖరికి న్యాయం గెలిచినందుకు సంతోషంగా అనిపిస్తోంది అంటోంది షెగుఫ్తా. ఈ రోజున నాన్న ఆత్మకు శాంతి చేకూరుతుందిని గర్వంగా చెబుతోంది ఈ యంగ్ లాయర్.
ఈ యువతి పట్టుదల ఎంతో మంది మహిళలకు ఆదర్శం. దేనికి భయపడకుండా.. అన్ని సంవత్సరాలు పోరాడి విజయం సాధించడం అంటే.. ఎంతో గొప్ప విషయం కదా..!

Read more RELATED
Recommended to you

Exit mobile version