సమాజంలో కేవలం మనం బతకడమే కాదు.. మన చుట్టూ ఉన్న ఎంతో మందికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత చేయాలి. చేతనైనంత సహాయం చేసి తోటి వారికి అండగా నిలవాలి.
సమాజంలో కేవలం మనం బతకడమే కాదు.. మన చుట్టూ ఉన్న ఎంతో మందికి సహాయం చేయాలి. ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి. మనకు ఎంత వీలైతే అంత చేయాలి. చేతనైనంత సహాయం చేసి తోటి వారికి అండగా నిలవాలి. సరిగ్గా ఇదే విషయాన్ని నమ్మారు కాబట్టే.. ఆ జంట ఉన్నతమైన ఉద్యోగాలు చేస్తూ కూడా ఓ పేద కుటుంబానికి అండగా నిలుస్తున్నారు. వారి స్టోరీ వింటే ఎవరైనా హ్యాట్సాఫ్ అనక మానరు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే…
ముంబైకి చెందిన అశ్విని షెనాయ్ షా, ఆమె భర్త ఇద్దరూ ఎంబీఏ చదివారు. ముంబైలోని ప్రముఖ కంపెనీలో ఉన్నత స్థానంలో ఉద్యోగాలు చేస్తున్నారు. అయితే వారింట్లో పని చేసే ఓ పేద వృద్ధురాలి భర్తకు ఇటీవలే పక్షవాతం వచ్చింది. దీంతో ఆమె భర్తను చూసుకోవడం కోసం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అయితే ఆమె తప్ప ఇంట్లో సంపాదించేవారు లేరు. దీంతో వారి ఆర్థిక పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ఇదే విషయాన్ని అశ్విని, ఆమె భర్త గుర్తించి ఆ వృద్ధురాలికి ఎలాగైనా సరే సహాయం చేయాలని అనుకున్నారు. అనుకున్నదే తడవుగా తమ ఆలోచనను వారు ఆచరణలో పెట్టారు.
అశ్విని, ఆమె భర్త ఇద్దరూ కలిసి ముంబైలోని కందివలి స్టేషన్ సమీపంలో రోడ్డు పక్కన తోపుడు బండిపై ఇడ్లీ, పోహా, ఉప్మా, పరాఠాలను అమ్మడం మొదలు పెట్టారు. అయితే వాటిని తన ఇంట్లోనే ఆ వృద్ధురాలు వండి అక్కడికి పంపుతుంది. వాటిని అశ్విని, ఆమె భర్త అమ్మడం ప్రారంభించారు. అలా వారు నిత్యం ఉదయాన్నే 4 నుంచి 10 గంటల వరకు వారు ఆ అల్పాహారాలను అక్కడ అమ్మడం మొదలు పెట్టారు. ఆ అమ్మకాలతో వచ్చిన డబ్బును ఆ వృద్ధురాలికే ఇస్తున్నారు. ఆ తరువాత వారిద్దరూ యథావిధిగా తమ తమ ఆఫీసులకు వెళ్లిపోతారు. ఇదీ.. ఆ యువజంట దినచర్య.. తోటి వారిని ఆదుకోవాలంటే మన జేబులో ఉన్న డబ్బును ఖర్చు పెట్టాల్సిన పనిలేదు. ఇలా కూడా చేయవచ్చని వారు నిరూపిస్తున్నారు. ఈ క్రమంలోనే వారి గురించిన ఓ పోస్టును సోషల్ మీడియాలో షేర్ చేయగా.. ఆ యువ జంట ఆదర్శాలను అందరూ అభినందిస్తున్నారు. అవును మరి.. తోటి వారికి సహాయం చేయాలనే ఆలోచనే ఎవరినైనా గొప్పవారిని చేస్తుంది..!