ఏదైనా కొత్తగా చేయాలని, నూతన వస్తువులను ఆవిష్కరించాలనే తపన ఉంటే చాలు.. అందుకు పెద్ద పెద్ద డిగ్రీలు.. భారీగా ఖర్చు అవసరం లేదు. నైపుణ్యం, ఆవిష్కరణకు కావల్సిన విజ్ఞానం, కొద్దిగా శ్రమ ఉంటే చాలు.. ఎవరైనా నూతన ఆవిష్కరణలు చేయవచ్చు. అందుకు పేదరికం కూడా అడ్డుకాదు. అవును, సరిగ్గా ఇదే విషయాన్ని అతను నిరూపించాడు. అతను 10వ తరగతి వరకే చదివాడు. కానీ తనకున్న ఆసక్తితో ఏకంగా ఓ నూతన స్మార్ట్ సిస్టమ్‌నే తయారు చేశాడు. ఇంతకీ అసలు ఆ సిస్టమ్ ఏంటి ? ఆ యువకుడు ఎవరు ? అంటే…
అతని పేరు సాయి తేజ. వయస్సు 22 సంవత్సరాలు. ఉంటున్నది హైదరాబాద్‌లో. సాయితేజ 10వ తరగతి వరకే చదివాడు. ఆ తరువాత పలు కారణాల వల్ల చదువు ఆపేశాడు. అయినప్పటికీ అతనికి ఎలక్ట్రానిక్స్ అంటే ఆసక్తి ఎక్కువ. దీంతో ఎప్పుడూ ఏదో ఒక కొత్త వస్తువును తయారు చేయాలని ఆసక్తి చూపేవాడు. అందులో భాగంగానే అతను తన ఆవిష్కరణకు గాను ఇంటర్నెట్‌ను ఎంచుకున్నాడు. అందులో కొత్త కొత్త పాఠాలు నేర్చుకున్నాడు. చివరకు ఓ అద్భుతమైన డివైస్ ను తయారు చేశాడు.
సాయితేజ తయారు చేసిన స్మార్ట్ సిస్టమ్ డివైస్ వాహనాలు నడిపే వారు మద్యం తాగి ఉంటే దాన్ని గుర్తించి ఇంజిన్ ఆన్ కాకుండా చూస్తుంది. అంతేకాదు, ఆ వివరాలను ముందుగానే సెట్ చేసి పెట్టుకున్న మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ రూపంలో పంపుతుంది. ఈ డివైస్‌ను తయారు చేసేందుకు సాయితేజ ఇంటర్నెట్‌ను ఆశ్రయించడమే కాదు, అందుకు అవసరమైన సాఫ్ట్‌వేర్ ప్రోగ్రామింగ్‌ను కూడా స్వయంగా నేర్చుకోవడం విశేషం. అలా అతను నెట్‌లో పాఠాలు నేర్చుకుని ఆల్కహాల్ శాతాన్ని కొలిచే ఆ డిటెక్టర్‌ను తయారు చేశాడు. ఈ డిటెక్టర్ డ్రైవర్ 30 శాతం కన్నా ఎక్కువగా మద్యం సేవించి ఉంటే వెంటనే గుర్తించి వాహన ఇంజిన్ ఆన్ కాకుండా చూస్తుంది. అలాగే డిటెక్టర్‌లోని మైక్రో కంట్రోలర్‌లో ముందుగానే సెట్ చేసి పెట్టిన మొబైల్ నంబర్లకు డ్రైవర్ మద్యం సేవించాడనే వివరాలను ఎస్ఎంఎస్ రూపంలో పంపుతుంది. దీంతో ఈ మెసేజ్ అందుకున్న అవతలి వారు కూడా అలర్ట్ అవుతారు. ఇక సాయితేజకు ఈ డివైస్‌ను తయారు చేసేందుకు కేవలం 15 రోజులు మాత్రమే పట్టగా, అందుకు గాను రూ.2500 మాత్రమే ఖర్చవడం మరో విశేషం. ఏది ఏమైనా సాయితేజ రూపొందించిన ఈ డిటెక్టర్‌కు, అతని ప్రతిభకు అతన్ని మనమందరం అభినందించాల్సిందే కదా..!